NTV Telugu Site icon

Congress: రాహుల్ గాంధీ ఈడీ విచారణ.. రాజ్ భవన్ ముట్టడికి పిలుపు

Revanth Reddy

Revanth Reddy

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో రాహుల్ గాంధీని మూడు రోజులుగా ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) విచారిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. ఢిల్లీలో ఈడీ ఆఫీస్ ముందే కాంగ్రెస్ అగ్రనేతలు నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన, ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి.

తాజాగా రాహుల్ గాంధీ ఈడీ విచారణపై తెలంగాణ కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. గురువారం రాజ్ భవన్ ముందు నిరసన తెలపనున్నారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. రేపు ఉదయం 10 గంటలకు పీజేఆర్ విగ్రహం వద్దకు చేరుకోవాలని కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అక్కడి నుంచి ర్యాలీగా రాజ్ భవన్ వరకు వెళ్లనున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు హాజరుకావాలని రేవంత్ రెడ్డి కోరారు. జిల్లాలలో కేంద్ర ప్రభుత్వ కార్యాాలయాల ముందు నిరసన తెలపాలని శ్రేణులకు సూచించారు.

ఈడీ విచారణపై రేవంత్ రెడ్డి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ అనుబంధ సంస్థగా ఈడీ మారిందని.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు. అర్థరాత్రి వరు విచారణ పేరుతో వేధిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తే, పోలీసులు దారుణంగా దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. ఈ రోజు ఏఐసీసీ కార్యాలయంలోకి కూడా పోలీసులు వెళ్లారని.. గాంధీ కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపులకు బలి చేయాలని బీజేపీ, కేంద్ర ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు.

తెలంగాణ సోనియా గాంధీ ఇవ్వకపోతే..వెయ్యి మంది కేసీఆర్ లు వచ్చినా తెలంగాన వచ్చేది కాదని రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీకి జరిగిన అవమానం అంటే..దేశ ప్రజల మీద సంస్కృతి మీద దాడి చేసినట్టే అని అన్నారు. అర్థంపర్థం లేని ఈడీ నోటిసులు ఇచ్చి..మీరు కడుక్కొండి అంటే ఎలా అని ప్రశ్నించారు. సోనియా, రాహుల్ గాంధీలను ఎదుర్కోలేకే ఈడీ పేరుతో వేధిస్తున్నారని.. రేపు కాంగ్రెస్ తడాఖా ఏమిటో చూపిస్తాం అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు.