Site icon NTV Telugu

Malla Reddy: నాపై జరిగిన దాడి వెనుక రేవంత్ రెడ్డి కుట్ర

Malla Reddy On Attack

Malla Reddy On Attack

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లో నిర్వహించిన రెడ్ల సింహగర్జన బహిరంగ సభలో మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే! తొలుత ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొందరు వ్యతిరేక నినాదాలతో గందరగోళం సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా ఉందని, సీఎం కేసీఆర్ అనేక పథకాల్ని అమలు చేస్తున్నారని మల్లారెడ్డి ప్రశంసలు కురిపిస్తున్న తరుణంలో సభికుల నుంచి ఒక్కసారిగా వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. దీంతో ఆయన తన ప్రసంగం ముగించుకొని కాన్వాయ్‌లో వెళుతుండగా.. నిరసనకారులు కుర్చీలు, చెప్పులు, రాళ్ళతో దాడి చేశారు. వారిని అదుపు చేస్తూ.. మంత్రి వాహనాల్ని పోలీసులు ఎలాగోలా సురక్షితంగా బయటకు పంపించారు.

ఈ దాడి విషయమై ప్రముఖ మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి.. ఇదంతా రేవంత్ రెడ్డి కుట్రేనని ఆరోపించారు. ఆయన ప్రజావ్యతిరేక చర్యల్ని ప్రశ్నిస్తున్నాననే అక్కసుతోనే తన అనుచరుల్ని సభకు పంపించి, రేవంత్ దాడి చేయించాడని అన్నారు. ఇలాంటి చర్యలకు తాను భయపడే ప్రసక్తే లేదని, దేనికైనా సిద్ధమేనని మల్లారెడ్డి చెప్పారు. అన్ని సామాజిక వర్గాల్ని న్యాయం చేసేందుకు కేసీఆర్ కంకణబద్ధులై ఉన్నారని, మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్టు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే, కరోనా కారణంగా ఆలస్యమైందని తాను వివరిస్తున్న తరుణంలోనే నినాదాలు చేశారంటూ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version