Site icon NTV Telugu

Hyderabad: అద్దె కార్లను చోరీ చేస్తున్న ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ నగరంలో కార్లను అద్దెకు తీసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా గుట్టును రాచకొండ పోలీసులు ఛేదించారు. అక్టోబర్ నెలలో అద్దె కారు చోరీకి గురైందని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని.. జూమ్ కార్స్ ద్వారా కారును అద్దెకు తీసుకుని మళ్లీ తిరిగి ఇవ్వకపోవడంతో యజమాని ఫిర్యాదు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేశామని.. ఈ విచారణలో నిందితులు అద్దె కార్లతో పాటు బైకులను కూడా చోరీ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుల నుంచి ఐదు కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో కీలక నిందితుడు గుడ్డటి మహేష్ నూతన్ కుమార్ ఏపీకి చెందినవాడు అని వెల్లడించారు. తెలంగాణతో పాటు ముంబై, భువనేశ్వర్, చెన్నై, పూణెలలో నిందితులు అద్దెకు తీసుకున్న కార్లను గుర్తించామని తెలిపారు.

నూతన్ కుమార్ 2016లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడని.. ఆ తర్వాత మొబైల్ దొంగతనం కేసులో మలక్‌పేట్‌లో అరెస్ట్ అయ్యాడని వెల్లడించారు. నకిలీ గుర్తింపు కార్డులను ఇచ్చి కార్లను తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాల్లో అమ్మేవాడన్నారు. ప్రధాన నిందితుడు నూతన్ కుమార్‌పై మొత్తం 22 కేసులు ఉన్నాయన్నారు. అతడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశామని తెలిపారు. కార్లకు ఉండే జీపీఎస్ సిస్టమ్‌ను తొలగించి నిందితులు చోరీలకు పాల్పడేవారని పోలీసులు పేర్కొన్నారు. గతంలో అనేక పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసుల్లో నూతన్ కుమార్ అరెస్ట్ అయ్యాడని.. జైలు నుండి బయటకు రాగానే మళ్ళీ ఇదే దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. దొంగతనం చేసిన వాహనాలను మార్కెట్‌లో వివిధ ధరలకు అమ్ముతున్నాడని చెప్పారు. కార్లను అద్దెకు ఇచ్చే వారు మరింత టెక్నాలజీని పెంపొందించుకోవాలని రాచకొండ పోలీసులు సూచించారు.

Exit mobile version