Site icon NTV Telugu

Rejinthal Ganapathi Pooja: రేజింతల్ గణపతి.. సమ్ థింగ్ స్పెషల్

Rejinthal 1

Rejinthal 1

విఘ్ననాయకుడి పూజలకు సర్వం సిద్ధం అవుతోంది. ఆది పూజలు అందుకునే వాడు. కోరిక కోర్కెలు తీర్చే దేవుడు వినాయకుడు. అయితే ఇప్పడు చెప్పబోయే వినాయకుడి చరిత్ర మాత్రం కాస్త ఆశ్చర్యంగా అనిపించొచ్చు..సంగారెడ్డి జిల్లాలో స్వయంగా వెలిసిన వినాయకుడు ప్రతి ఏటా వరిగింజ అంత పరిణామంలో పెరుగుతున్నాడట.. ఏంటి ఆశ్చర్యంగా అనిపిస్తుందా.? కానీ ఇది నిజమని చెబుతున్నారు అక్కడి భక్తులు, ఆలయ నిర్వాహకులు. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని తొలి సిద్ధివినాయక ఆలయంగా ప్రసిద్ధికెక్కిన ఈ క్షేత్రం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బీదర్ ప్రధాన రహదారికి పక్కన ఉన్న రేజింతల్ గ్రామంలో ఉంది. ఈ స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి ఎందరో భక్తులు వస్తుంటారు.

Read Also: Brahmaji: ప్రభుత్వ సంస్థపై విరుచుకుపడిన నటుడు.. క్షమాపణలు చెప్పరా..?

గర్భాలయంలో ఉండే ఈ స్వామి దక్షిణాభిముఖుడై దర్శనమిస్తాడు. ఈ సిద్ధివినాయకుని రూపం చిన్న కొండలాంటి రాతిమీద అస్పష్టంగా ఉంటుంది. ఈ స్వామికి సింధూరవర్ణం పులమడంవల్ల చూడగానే ముందు మనకు ఆంజనేయస్వామి గుర్తుకు వస్తాడు. దాదాపు 220 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ ఆలయంలోను సిద్ధివినాయకునికి పైన ఉండే ఛత్రం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వెనుకన సువర్ణ మకరతోరణం, దిగువన రజిత మకరతోరణంతో పాటు సూక్ష్మగణపతి విగ్రహం కూడా ఉంటుంది.

ఒకప్పుడు దట్టమైన కీకారణ్యంగా ఉండే ఈ ప్రాంతానికి ‘శివరాం పంతులు’ అనే యాత్రికుడు కాలినడకన అనేక క్షేత్రాలు దర్శిస్తూ, ఈ రేజింతల్ ప్రాంతానికి రాగానే ఎంతో మానసిక ప్రశాంతత కలిగిందట. అందుకే ఆయన చాలాకాలం అక్కడ తపోదీక్షలో ఉన్నాడు. ఆ సమయంలో సిద్ధివినాయకుడు ఆయనకు తన ఉనికిని తెలియజేసి, పూజాదికాలు నిర్వహించమని ఆదేశించాడు. శివరాం పంతులు ఆ ప్రాంతం అంతా అన్వేషించి స్వయంభువుగా వెలసిన సిద్ధివినాయకుని ప్రతిమను దర్శించి బాహ్య ప్రపంచానికి తెలియజేసాడు. అప్పటి నుంచీ రేజింతల్ ‘సిద్ధివినాయకుడు’ మహావైభవంతో కళకళలాడుతూ భక్తకోటిని అనుగ్రహిస్తూనే ఉన్నాడని అంటున్నారు ఇక్కడి ప్రధాన అర్చకులు.

ఈ సిద్ధివినాయకుడు ఏటేటా పెరుగుతుంటాడని భక్తుల నమ్మకం. ముందు ఒకటిన్నర ఎత్తు, మూడడుగుల వెడల్పు ఉన్న స్వామివారి విగ్రహం ఇప్పుడు ఐదున్నర అడుగుల ఎత్తూ, ఆరడుగుల వెడల్పు అయ్యిందని భక్తులు అంటారు. సకల విఘ్నాలను తొలగించి, భక్తకోటికి సర్వశుభాలు చేకూర్చే స్వామిగా ఈ సిద్ధివినాయకునికి ఎంతో పేరున్న కారణంగా శ్రీ కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఈ క్షేత్రంలో సంకట చతుర్థి వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. సంకటహర చతుర్దశి, మంగళవారం కలిసి వస్తే ఇంకా విశేషంగా వేడుకలు జరుగుతాయి. అయితే ఈ సారి ఈ నెల సెప్టెంబర్ 13న మంగళవారంతో పాటు సంకట చతుర్థి ఒకే రోజు రావడంతో ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తామంటున్నారు ఆలయ నిర్వాహకులు. అలాగే స్వామివారిని ఆ రోజు దర్శించుకోవడానికి 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.

Read Also: Kallakuruchi Case: కళ్లకురిచి కేసు రేప్, మర్డర్ కాదు.. కేవలం సూసైడ్ మాత్రమే: మద్రాస్ హైకోర్టు

Exit mobile version