NTV Telugu Site icon

Ration Mafia: రూట్‌ మార్చిన రేషన్‌ మాఫియా.. రైళ్లలో సరిహద్దులు దాటుతోన్న బియ్యం..!

Ration Mafia

Ration Mafia

రేషన్ మాఫియా రూట్ మార్చిందా..? చిన్నచిన్న వాహనాల్లో అయితే ఈజీగా దొరికేస్తామని ఏకంగా రైళ్లలోనే అక్రమ రవాణాకు తెగిస్తున్నారా..? రాష్ట్ర సరిహద్దులు లేదా జిల్లా సరిహద్దుల్లో గోదాముల్లో నిల్వ చేసి రాత్రికి రాత్రే రాష్ట్రాలు దాటిస్తున్నారా..? అంటే అవుననే స్పష్టం అవుతోంది.. కొమురం భీం జిల్లా సిర్పూర్ టి రోడ్డు రైల్వే స్టేషన్ మీదుగా పీబీఎస్‌ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు అందించే పీడీఎస్ బియ్యాన్ని కొందరు దళారులు అక్రమమార్గం ద్వారా మహారాష్ట్రకు రైళ్లలో తరలించి ధనార్జన ధ్యేయంగా దందాకు తెరలేపారు.. కొమురం భీం జిల్లాలోని ఓ రైల్వే స్టేషన్‌ను తమ దందాకు అడ్డాగా మార్చుకున్నారు.. అది చిన్నరైల్వే స్టేషన్ కాబట్టి ఎక్కువగా అధికారులు తనిఖీలు ఉండవని భావించి దళారులు ఈ రైల్వే స్టేషన్ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణాకు హాట్ స్పాట్ గా ఎంచుకోని రాష్ట్రం దాటిస్తున్నారు.

Read Also: Astrology : అక్టోబర్‌ 27, గురువారం దినఫలాలు

ఇటీవలి కాలంలో చిన్నచిన్న వాహనాల్లో అనుమానం రాకుండా రాష్ట్ర సరిహద్దులు దాటించే వారు.. అయితే కొన్ని చోట్ల నిఘా ఎక్కువ కావడం.. పైగా పట్టుబడుతామనే భయంతో రాత్రికి రాత్రే రేషన్ బియ్యం రైల్వే స్టేషన్లు లేదా రాష్ట్ర సరిహద్దు దాటించేస్తున్నారు.. పెద్ద పెద్దల లారీలకు.. పైలట్ వాహనాలను పెట్టుకొని కొంతమందిని మచ్చిక చేసుకొని దందా సాగిస్తున్నారు.. ముందుగా గ్రామాలలో రేషన్ డీలర్లతో కుమ్మక్కై దాదాపు 13 రూపాయలకు వారి వద్ద నుండి కొనుగోలు చేయడం.. ఆ తర్వాత ఆ బియ్యాన్ని రైల్వే స్టేషన్ కు తరలించడం.. రైల్ వచ్చిందంటే చాలు అందులో వేసి పక్క రాష్టానికి తరలిస్తున్నారు.. అక్రమంగా రైళ్లలో సీట్ల కింద వేసి మహారాష్ట్రకు తరలించి అక్కడ దాదాపు కిలోకు రెట్టింపు ధరకు అమ్ముకుంటున్నారు. అయితే ఇంత విచ్చలవిడిగా రాష్ట్రాలు దాటి బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరీ ముఖ్యంగా మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో రేషన్ బియ్యం దందా మూడుపూలు ఆరు కాయలుగా కొనసాగుతుంది. జిల్లాలో కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 5వ తేదీ నుండి 20 తేదీ వరకు ఈ దందా నడుస్తుంది.

రేషన్ బియ్యం అక్రమ రవాణాకు కొంతమంది కక్కుర్తిపడిన అధికారుల మద్దతుగా ఉండడం, మరికొన్ని శాఖల అధికారులు మామూళ్లు తీసుకొని వారికి సహకరించడంతో.. బియ్యం క్వింటాళ్లలో కాదు టన్నుల కొద్ది రాష్ట్రం దాటిపోతుంది.. కొమురం భీం జిల్లా లో రెబ్బనలోని రైస్ మిల్లు, గోదాంలలో ఈ దందా చేపిస్తున్నారనే టాక్ ఉంది.. ఇక్కడి నుంచే కాగజ్ నగర్, దహేగాంతోపాటు 8 మార్గాల గుండా బియ్యాన్ని తరలిస్తారు.. ఎక్కువగా వీరు ఆంద్రా పాసింగ్ వావానాలు వాడుతున్నారు.. వీటికై పైలెట్ వావానాలు ముందే చక్కర్లు కొడుతాయి.. అంతేకాదు ఒక్కసారి వాడిన వాహనం మరోసారి వాడరంటా.. కిందిస్థాయి నుంచి జిల్లాస్థాయి ఉన్నతాధికారుల అండదండలతోనే దందాసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మంచిర్యాల జిల్లాలో ని సరిహద్దు ప్రాంతాల్లో బియ్యం మాఫియాకు ప్రత్యేకంగా గోదాములను ఏర్పాటు చేసుకుంది ముఠా.. డీలర్ల వద్ద నుంచి సేకరించిన బియ్యం సదరు గోదాముల్లో డంప్ చేసి లోడుకు సరిపడా కావడంతో లారీ నింపి వీలు చూసుకోని తరలిస్తున్నారు.. ఇది అందరికి తెలిసినా ఏ శాఖ అధికారి పట్టించుకోడని ధీమా బియ్యం మాఫియాలో ఉందనే ఆరోపణలున్నాయి. అందుకే విచ్చల విడిగా దందా సాగిస్తున్నారనే ఆరోపణలు పెల్లుబికుతున్నాయి.