Site icon NTV Telugu

Rahul Gandhi: రేపు రాష్ట్రానికి రాహుల్ గాంధీ.. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్సాహం నింపేందుకు ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేపు (ఈ నెల 17న) రాష్ట్రానికి రానున్న ఆయన ఒకేరోజు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తుఫాన్ పర్యటన చేయనున్నారు. రాహుల్ ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక చేరుకుంటారు. అక్కడ కార్నర్ మీటింగ్ లో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నర్సంపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు అక్కడే ప్రచారం నిర్వహించి రోడ్డు మార్గంలో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడి నుంచి పాదయాత్రగా పశ్చిమ నియోజకవర్గానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వీధి సభలో ప్రసంగిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో సాయంత్రం 6:30 గంటలకు రాజేంద్రనగర్ చేరుకుంటారు. అక్కడ సమావేశానికి హాజరైన తర్వాత ఆయన ఢిల్లీ వెళతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటి వరకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు రోజుకు గరిష్టంగా మూడు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. రాహుల్ గాంధీ ఒకేరోజు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించడం గమనార్హం.

21వ తేదీ తర్వాత ప్రచారం…

తెలంగాణ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార గడువు ఈ నెల 21తో ముగియనుంది. దీని తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణలో ఐదు రోజుల పాటు ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కనీసం 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఇతర ఏఐసీసీ అగ్రనేతలు కూడా 21 తర్వాత తమ పూర్తి సమయాన్ని తెలంగాణకే కేటాయిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Annavaram EO Transfer: అన్నవరం దేవస్థానం ఈవో ఆకస్మిక బదిలీ

Exit mobile version