NTV Telugu Site icon

Raghunandan Rao: ఓఆర్ఆర్ లీజ్‌లో కుట్ర ఉంది.. ఆ 16 రోజుల్లో ఏం జరిగింది?

Raghunandan Orr

Raghunandan Orr

Raghunandan Rao Raises Questions On ORR Contract: ఓఆర్ఆర్ లీజ్ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సరికొత్త అనుమానాల్ని లేవనెత్తారు. మంగళవారం హైద్రాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కలిసి తమ స్నేహితుల కంపెనీకి ఓఆర్ఆర్‌ను లీజుకు ఇచ్చారని ఆరోపించారు. ఓఆర్ఆర్ కాంట్రాక్టు బిడ్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 11న తెరిచినట్టు చెప్పారని.. కానీ ఏప్రిల్ 27న ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ మీడియాకు ప్రకటన విడుదల చేశారని గుర్తు చేశారు. బిడ్ ఓపెన్ చేసిన 16 రోజుల తర్వాత.. ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టారని ప్రశ్నించారు. తొలుత ఓఆర్ఆర్ టెండర్‌ దక్కించుకున్న ఆ కంపెనీ రూ.7272 కోట్లు కోట్ చేసిందని.. కానీ రూ.7,380 కోట్లుగా అరవింద్ కుమార్ ఎలా ప్రకటించారని అడిగారు. టెండర్ల ప్రక్రియ పూర్తైన తర్వాత కంపెనీ బిడ్ దాఖలు చేసిన అమౌంట్ ఎలా పెరిగిందని.. ఈ డబ్బు ఎవరిని అడిగి పెంచారని అన్నారు. ఆ 16 రోజుల గ్యాప్‌లో ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు.

Bandi Sanjay: కేసీఆర్ ఇచ్చిన ఆ హామీ ఇంతవరకు అమలు కాకపోవడం సిగ్గుచేటు

ఓఆర్ఆర్ టెండర్ ఫైనల్ చేసిన ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 27వ తేదీ వరకు అరవింద్ కుమార్ ఫోన్ కాల్స్ డేటాను ప్రభుత్వం బయటపెట్టగలదా? అసలు ఆ గ్యాప్‌లో అరవింద్ కుమార్ హైదరాబాద్‌లోనే ఉన్నాడా? ఆ 16 రోజులు అరవింద్ కుమార్‌తో పాటు ఎవరైనా బయటకు వెళ్లారా? అని రఘునందన్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. ఓఆర్ఆర్ టెండర్ ఫైనల్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు ఐదు రోజుల పాటు కనిపించకుండా పోయారని కూడా ఆరోపించారు. ఓఆర్ఆర్‌కు అదానీ కంపెనీ రూ. 13 వేల కోట్లకు టెండర్ వేసేందుకు సిద్దమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఓఆర్ఆర్‌పై బేస్ ప్రైజ్‌ను నిర్ణయించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీని గతంలో హెచ్‌ఎండీఏ డిఫాల్టర్‌గా ప్రకటించిందని.. ఆ సంస్థపై ఇప్పటికే సీబీఐ విచారణ జరుగుతోందని.. ఈ టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓఆర్ఆర్ టోల్‌గేట్ ద్వారా ప్రతిరోజూ వస్తున్న ఆదాయం ఎంతో బయటపెట్టాలని, అలాగే ఏప్రిల్‌లో ఎంత అమౌంట్ వచ్చిందో రివీల్ చేయాలని కోరారు. నేషనల్ హైవేలపై టోల్ గేట్‌ల దగ్గర రోజు వచ్చిన ఆదాయం ఎంతో డిజిటల్ బోర్డ్ ద్వారా సంబంధిత ఏజెన్సీ తెలుపుతుందన్నారు.

Boora Narsaiah Goud: బీజేపీ అధికారంలో ఉండుంటే.. తెలంగాణ మరో లెవెల్‌లో ఉండేది

ఏప్రిల్‌లో రోజు సరాసరి కోటి 80 లక్షలు ఆదాయం వస్తోందని.. కానీ ఆ సంస్థ మాత్రం కేవలం రూ.67 లక్షలే కడుతోందని రఘునందన్ రావు తెలిపారు. ప్రస్తుతం నడుపుతున్న ఈగల్ ఇన్‌ఫ్రా కంపెనీకి ఏడాదికి రూ.517 కోట్లు కట్టమని నోటీసులు ఇచ్చారన్నారు. బిడ్ ఓపెన్ చేసిన వెంటనే ఎందుకు చెప్పలేదని మరోసారి నిలదీశారు. ఓఆర్ఆర్‌పై క్రిజిల్ సంస్థ సర్వే రిపోర్టును పబ్లిక్ డొమైన్‌లో పెట్టడానికి ప్రభుత్వానికి అభ్యంతరం ఏమిటన్నారు. ప్రతిరోజూ ఆదాయం వచ్చే ఓఆర్ఆర్ టోల్ కోసం.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం లేదన్నారు. ఆ 16 రోజుల గ్యాప్‌లో అరవింద్‌తో వచ్చిన మంత్రి ఎవరో బయటపెట్టాలని, లేకపోతే తాము ఆడియో, వీడియోలో బయటపెడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు తలకాయ లేని వారైతే.. సీఎం కూడా తలకాయ లేని వాడే అవతాడంటూ చురకలంంటించారు. ఇక సెక్రటేరియట్‌లో ఎమ్మెల్యేలకు ఎంట్రీ లేకపోతే ఎలా? అని ప్రశ్నించిన ఆయన.. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Show comments