తమ తరఫున దేవుడికి పూజలు నిర్వహించినందుకు గాను పూజారులకు భక్తులు ఎంతో కొంత దక్షిణ ఇస్తుంటారు. ఇది పూర్వం నుంచి వస్తోన్న సంప్రదాయం. లాజికల్‌గా చూసుకుంటే.. ఏ పూజారికి అయితే దక్షిణ లభిస్తుందో, అది అతనికే సొంతం. కానీ.. తన ఆదేశాల మేరకు మరో పూజారి పూజ నిర్వహించినందుకు, వచ్చిన దక్షిణలో తనకూ కొంత మొత్తం ఇవ్వాలని ఓ అర్చకుడు గొడవకు దిగిన సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
జిల్లాలోని మేళ్ళచెరువు శివాలయానికి నరసింహ అనే తాత్కాలిక పూజారి వచ్చాడు. మే 23వ తేదీన అర్చకుడు విష్ణువర్ధన్ శర్మ ఆదేశాల మేరకు నరసింహ వాహన పూజ నిర్వహించాడు. పూజ ముగిసిన తర్వాత భక్తులు ఆయనకు దక్షిణ సమర్పించారు. అందులో తనకూ సగం డబ్బులు ఇవ్వాలని శర్మ అడిగాడు. తాను ప్రధాన అర్చకుడ్ని అడిగి డబ్బులిస్తానని నరసింహ చెప్పాడు. దీంతో కోపాద్రిక్తుడైన శర్మ, అతనితో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా.. నరిసింహపై దాడికి పాల్పడ్డాడు. ‘నాకే ఎదురు తిరుగుతావా’ అంటూ కోపంతో ఊగిపోతూ.. విచక్షణారహితంగా చెయ్యి చేసుకున్నాడు.
ఈ మొత్తం దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన ఫోన్‌లో బంధించి, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దీంతో, అది వైరల్ అయ్యింది. ఈ వీడియో ఆలయ అధికారుల కంట పడడంతో.. సీరియస్‌గా స్పందించారు. దాడికి పాల్పడిన ధనుంజయ శర్మకి మెమో జారీ చేసినట్టు తెలుస్తోంది. డబ్బుల కోసం పూజారులు కూడా ఇలా కొట్టుకుంటారా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.