Property Value increased in telangana state: తెలంగాణలో స్థిరాస్తి లావాదేవీలు భారీగా పెరిగాయి. ఇళ్లు, ఇళ్ల స్థలాల అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. గత ఆరేళ్లలో స్థిరాస్థి లావాదేవీలు రెట్టింపు అయ్యాయి. ఈ లావాదేవీల్లో HMDA అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో 80 శాతం హైదరాబాద్ చుట్టుపక్కలే కేంద్రీకృతమైంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డేటా ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో 7.46 లక్షల ప్లాట్లు, ఇళ్లు, ఫ్లాట్ల క్రయవిక్రయాలు జరగ్గా.. వీటి విలువ రూ.1.05లక్షల కోట్లుగా నమోదైంది. వీటి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.7,560 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువ కంటే 45 శాతం ఎక్కువ మొత్తానికి రిజిస్ట్రేషన్లు జరిగాయి.
Read Also: Komatireddy: కోమటిరెడ్డి రాజ “గోపి”ల్‌రెడ్డి. అటో ఇటో దూకొచ్చు కదా!
2020-21లో కరోనా లాక్‌డౌన్‌ల ప్రభావం వల్ల రిజిస్ట్రేషన్లు మందగించాయి. అయితే మరుసటి ఏడాది 2021-22 ఆర్ధిక సంవత్సరంలో రికార్డుస్థాయిలో స్థిరాస్థి లావాదేవీలు పెరిగాయి. ఇళ్ల స్థలాలను ప్రజలు అధికంగా కొనుగోలు చేస్తుండగా.. అపార్టుమెంట్లలోని ఫ్లాట్లను, ఇండిపెండెంట్ హౌస్‌ల కొనుగోళ్లు కూడా దూసుకుపోతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాలలోని రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని హెచ్‌ఎండీఏ ప్రాంతాల్లో స్థిరాస్తి లావాదేవీలు అత్యధికంగా జరుగుతున్నాయి. మొత్తంగా రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.9,237 కోట్ల రాబడి వచ్చినట్లు తెలుస్తోంది. కేవలం ఇళ్ల స్థలాలు, ఇళ్లు, ఫ్లాట్ల క్రయ, విక్రయాల ద్వారా రూ.7,560 కోట్లు సమకూరింది. అటు ఎల్‌ఆర్‌ఎస్‌కు ప్రభుత్వానికి 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
