టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తామనే వార్తలు వస్తున్న వేళ పీకే భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు రాష్ట్రపతి ఎన్నికలు, తెలంగాణలో పీకే టీం చేసిన సర్వే వివరాలను పీకే, సీఎం కేసీఆర్ కు అందించారు. దాదాపు 3 గంటల పాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల గురించి చర్చించేదుకు ఈ నెల 15న ఢిల్లీకి రావాల్సిందిగా సీఎం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫోన్ చేశారు. అయితే తాజాగా పీకే భేటీ కావడం ప్రాధన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు కూడా పాల్గొన్నారు. అయితే మరో రెండు రోజులు ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ లోనే ఉండబోతున్నారు.
ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికల విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒక వేళ ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అభ్యర్థుల కూర్పు ఏ విధంగా ఉండాలనే దానిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే పీకే చేసిన సర్వేలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి, గ్రాఫ్ ఏ విధంగా ఉందనే వివరాలను పీకే, సీఎం కేసీఆర్ కు అందించారు. తాజాగా తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో పీకే టీం చేసిన సర్వే వివరాలను కూడా సీఎం కేసీఆర్ కు అందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి ముందస్తుకు వెళ్తే దాదాపుగా 40-50 శాతం మంది ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ముందస్తుకు వెళ్తే ఏది మంచి సమయం అనే దానిపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. జాతీయ పార్టీ ఏర్పాటు అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఏపీ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ అయ్యారు. కాగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న సీఎం కేసీఆర్, ఈ విషయంపై ఉండవల్లితో భేటీ అయినట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్న సీఎం కేసీఆర్, ఏపీ బాధ్యతలను ఉండవల్లికి అప్పగిస్తారనే చర్చ నడుస్తోంది.
