రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తే ఎవరు అడ్డుకున్నారు.? బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్ ప్రకాశ్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఓ పత్రికా ప్రకటనల విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారిపై నిందలు ఆపండని ఆయన అన్నారు. విభజన చట్టంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పరిశీలిస్తామన్న హామీ మాత్రమే ఉందని, 2014లో నరేంద్రమోదీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ప్రధాన డిమాండ్ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అంశంపై కమిటీని నియమించిందని ఆయన తెలిపారు. బయ్యారం సమీపంలోని ప్రాంతాలను పరిశీలించిన కమిటీ.. ఇక్కడి ఇనుప ఖనిజంతో ఉక్కు తయారీ లాభసాటి కాదని తేల్చిందన్నారు. అంతేకాదు స్టీల్ ధరలన్నీ అంతర్జాతీయ మార్కెట్ పై ఆధారపడిన తరుణంలో నష్టాలతో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని నడపడం సాధ్యంకాదన్నారు.
అయినా ఈ విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎప్పుడూ సానుకూలంగానే ఉన్నారన్నారు. కేంద్రం గీంద్రం జాంతానై .. సింగరేణి ఆధ్వర్యంలో మైనింగ్ జేపిచ్చి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభం చేస్తా అని అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చేసిందేం లేదు అని ఆయన విమర్శించారు. మరోవైపు 2018 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే కేంద్ర సహకారం లేకుండానే సింగరేణి, రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర వనరులతోనే ప్రారంభం చేసుకుంటామన్న కేసీఆర్ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలన్నారు.
