Site icon NTV Telugu

ఇక ఛలో హన్మకొండ..

హుజురాబాద్‌ ఉప ఎన్నిక తెలంగాణతో పాటు దేశం దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. ఈ ఎన్నికను దేశంలోనే అత్యంత ఖరీదైనదిగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఒక్క రోజు ప్రచారంలో లక్షలు ఖర్చు పెడుతున్నారు. పొద్దుగూకితే చాలు గ్రామాల్లో మద్యం ఏరులవుతుంది. ఇదే సమయంలో రాజకీయం రంజుగా సాగుతోంది.

రాత్రికి రాత్రి గ్రామ స్థాయి నాయకులను బట్టలో వేసుకుంటున్నారు. విందులు, వినోదాలతో పాటు కరెన్సీ కట్టలతో వారిని కట్టిపడేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలూ ఈ తరహా రాజకీయంలో ఆరితేరాయి. కాస్తా ఎక్కువ..తక్కువ అంతే తేడా! ఎన్నిల తేదీ సమీపిస్తుండటంతో ఆకర్షణ రాజకీయం గ్రామాలలో తారాస్థాయికి చేరింది. కొత్త కొత్త ఆశలు చూపి ఓటర్లకు గాలం వేస్తున్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం ఇంకో రెండు రోజుల్లో ముగుస్తుంది. ప్రచార పర్వానికి తెరపడుతున్న తరుణంలో నాయకుల స్వరం కూడా పెరిగింది. టిఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో సాగుతోంది. ఇక పక్కనే ఉన్న హనుమకొండ కేంద్రంగా హుజురాబాద్‌ రాజకీయ నుడుస్తోంది. రాజకీయ, ఆర్థిక లావాదేవీలకు ఈ నగరం అడ్డాగా మారింది. దానికి కారణం ఇది హుజురాబాద్‌కు సమీపంలో ఉండటమే.

నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కమలాపూర్‌ హనుమకొండ జిల్లా పరిధిలోకి వస్తుంది. మిగిలిన నాలుగు మండలాలు కరీంనగర్‌ జిల్లాకు చెందినవి. వివిధ పార్టీల నేతలు ఉదయం హుజురాబాద్‌ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొని తిరిగి సాయంత్రానికి హనుమకొండ చేరుకుంటున్నారు. ఇది వారికి ఎంతో సౌకర్యంగా .. అనుకూలగా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దాదాపు టీఆర్ఎస్ శాసనసభ్యులందరూ జూన్ నుంచి ఈ నియోజకవర్గానికి రాకపోకలు సాగిస్తున్నారు. పర్కాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వి సతీష్ కుమార్, నర్సంపేట పెద్ది సుదర్శన్ రెడ్డి – వారు తమ సొంత నియోజకవర్గాల కంటే ఎక్కువ సమయం హుజురాబాద్‌లో ఉన్నారన్న విమర్శలు మూటగట్టుకున్నారు.

టీఆర్‌ఎస్‌ నాయకులే కాదు..బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు కూడా ఇదే చేస్తున్నారు. కమలం పార్టీ నేతలు మార్తినేని ధర్మారావు, రేవూరి ప్రకాష్ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రావు పద్మ, చాడ సురేష్ రెడ్డి, అనుగుల రాకేష్ రెడ్డి తదితరులు, కాంగ్రెస్ కు చెందిన సీతక్క, వేం నరేందర్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి వంటి వారికి హనుమకొండలో నివాసాలు కూడా ఉన్నాయి.

అక్టోబరు 30 దగ్గరవుతుండటంతో నేతలంతా పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టారు. రాత్రులు తమ నిర్దేశిత ప్రాంతాలలో ప్రచారం ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత హనుమకొండలోని వారి నివాసాల నుండి కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇక ఢిల్లీ, హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు హనుమకొండలోని హరిత హోటల్ లో బస చేస్తున్నారు. ఈ హోటల్‌ ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తోంది. ఈ నాయకులు హుజూరాబాద్‌లో ప్రచారం ముగించుకుని సాయంత్రం హోటల్‌ గది నుంచి రాజకీయ నడుపుతున్నారు. కలవాల్సిన వారిని ఇక్కడకే రప్పించుకుని మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

ఏదేమైనా, హుజూరాబాద్ నియోజకవర్గంపై ఎన్నికల సంఘం దృష్టి సారించడంతో హనుమకొండ నేతలకు రక్షణ నిలయంగా మారింది. ముఖ్యంగా అక్కడి నుంచి ఆర్ధిక సంబంధ రాజకీయ లావాదేవీలు జరుగుతున్నట్టు సమాచారం. హైదరాబాద్ నుంచి ఇక్కడకు రావటం సులభం. అందుకే హుజూరాబాద్ నియోజకవర్గానికి వెళ్లే నేతలకు హనుమకొండ జంక్షన్‌గా మారింది.

ఇది ఇలావుంటే, హుజూరాబాద్ లో గెల్లు శ్రీనివాస్ బంపర్ మెజార్టీతో గెలుస్తారని సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీష్ రావు, గంగుల కమలాకర్ పార్టీ ప్లీనరీకి రాలేదు. వారు హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరాటంలో ఉన్నారని కేసీఆర్‌ అన్నారు. హుజురాబాద్‌ ఎన్నిక తమకు చాలా తేలికని కేటీఆర్‌ లాంటి నేతలు అంటుండగా..కేసీఆర్‌ మాత్రం దీనిని పోరాటంగా అభివర్ణించటం ఆసక్తిని కలిగిస్తోంది. రాజకీయ పరిశీలకులు కూడా ఈ మాటే అంటున్నారు!!

Exit mobile version