సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. మూడు రోజులు నిర్వహించుకునే పండగ కావడంతో చాలా మంది వారం రోజుల పాటు స్వగ్రామాలలో గడిపేందుకు ఊరికి వెళ్తున్నారు. అయితే ఇలాంటి సమయం కోసం వేచిచూస్తున్న దొంగలు పలు చోట్ల రెక్కీలు నిర్వహిస్తున్నారు. దోపిడీలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో రాచకొండ పోలీసులు ప్రజలకు కొన్ని సూచనలు జారీ చేశారు .
తాము ప్రజలను ఊరెళ్లొద్దని చెప్పడం లేదు కానీ, ఇంటికి తాళం పెట్టి వెళ్తున్న విషయం పక్క వారికి తప్పించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ సూచించారు. ఊరికి వెళ్తున్నామంటూ దయచేసి సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ఆయన హితవు పలికారు. ఇంటికి తాళం వేసినట్లు దొంగలకు తెలియకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. సాధ్యమైనంత వరకు కింది సూచనలను ప్రజలు పాటించాలని.. లేకపోతే ఇల్లు గుల్లకావడం ఖాయమని సీపీ మహేష్ భగవత్ హెచ్చరించారు.
పోలీసుల సూచనలు:
★ ఇంటికి తాళం వేసి తలుపు కనిపించకుండా కర్టెన్ వేయాలి
★ ఇంటి గుమ్మం ముందు కొన్ని జతల చెప్పులు అలాగే ఉంచాలి
★ ఇంట్లో లైట్ ఆన్ చేసి ఉంచాలి
★ విలువైన ఆభరణాలు, నగదు, డాక్యుమెంట్లను బ్యాంక్ లాకర్‌లో ఉంచి వెళ్లాలి
★ ఇంటి డోర్లకు లాక్ అలర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి
★ సీసీ కెమెరాలను అమర్చుకుని వాటిని ఫోన్‌లకు అనుసంధానం చేసుకోవాలి
