Site icon NTV Telugu

అగ్నిప్రమాదంపై అనుమానం… వివిధ కోణాల్లో దర్యాప్తు ముమ్మరం

సికింద్రాబాద్ క్లబ్ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే క్లూస్ టీమ్ అధికారులు పలు కీలక ఆధారాలను సేకరించారు. ఫైర్ సిబ్బంది నుంచి ప్రమాదంపై పలు వివరాలు సేకరించి పోలీసులు విచారణ చేపట్టారు. క్లబ్‌కు సంబంధించిన 50 వేల చదరపు అడుగుల స్థలంలో టేకు ఇంటీరియర్‌తో పాటు విలువైన మద్యం, నగేసిలు, ప్రాచీన అరుదైన ఫర్నీచర్ కాల్‌నైట్‌ బార్‌ బంగ్లా కిచెన్‌, మిలటరీ అధికారుల కార్యాలయాలు అగ్నికి ఆహుతైనట్లు పోలీసులు గుర్తించారు.

ఆదివారం తెల్లవారుజామున 3గంటలకు క్లబ్‌లో మంటలు రావడాన్ని గమనించిన ఇద్దరు కానిస్టేబుళ్లు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం వర్షం కారణంగా క్లబ్‌లో కరెంట్ సరఫరా నిలిచిపోయిందని… దాంతో జనరేటర్‌ ఆటోమేటిక్ ఆన్‌ అవ్వడం తిరిగి కరెంటు వచ్చిన సమయంలో ఏసీ/డీసీ షిఫ్టింగ్‌లో చోటుచేసుకున్న లోపాలతో మంటలు వ్యాపించి ఉంటాయని పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది భావిస్తున్నారు. ఈ అగ్నిప్రమాద ఘటనలో నష్టం రూ.25 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆస్తి నష్టం పెరిగే మరింత అవకాశం ఉందన్నారు.

క్లబ్ భవనంలో మద్యం, క్లబ్‌లో ఇంటీరియర్‌, అంతర్గత మెట్లు, చివరకు రెయిలింగ్‌ టేకు, ఇతర కలపతో చేసినవి కావడం వల్ల మంటలు వేగంగా వ్యాప్తి చెందాయని దర్యాప్తు పోలీసులు భావిస్తున్నారు. 14 మీటర్ల ఎత్తున్న భవనంలో అంతర్గత మెట్లు కర్రెతో చేసినవి కావడంతో పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయని పోలీసులు తెలిపారు. 9 ఫైరింజన్‌లను రప్పించి మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించారన్నారు. ఫోమ్‌ స్ర్పేతో చివరకు మంటలు అదుపులోకి వచ్చాయన్నారు.

కాగా క్లబ్‌ స్థలంలో కొనసాగుతున్న పెట్రోల్‌ బంక్‌ వరకు మంటలు వ్యాపించక పోవడంతో పెనుప్రమాదం తప్పింది. కాగా ప్రమాదం తీవ్రతను దాచేందుకు క్లబ్‌ యాజమాన్యం ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. కమిటీ సభ్యుల మధ్య కొన్ని రోజులుగా వివాదాలు నెలకొన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సికింద్రాబాద్ క్లబ్ ఉంది. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో క్లబ్‌ను నిర్వహిస్తున్నారు. దీంతో వివిధ కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Exit mobile version