Site icon NTV Telugu

Modi speech at Vijaya Sankalpa Sabha: తెలంగాణలో డబుల్‌ ఇంజన్‌ సర్కారు వస్తుంది

Pm Modi Speech At Bjp Vijaya Sankalpa Sabha At Hyderabad

Pm Modi Speech At Bjp Vijaya Sankalpa Sabha At Hyderabad

PM Modi speech at BJP Vijaya Sankalpa Sabha at Hyderabad

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ తన ప్రసంగంతో అందర్నీ ఆకట్టుకున్నారు. తెలుగులో స్పీచ్‌ ప్రారంభించి ఆశ్చర్యపర్చారు. నమస్కారం అంటూ ప్రజలకు అభివాదం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎంతో స్ఫూర్తినిస్తోందని చెప్పారు. హైదరాబాద్‌ మహానగరం ప్రతిభకు పట్టం కడుతుందని ప్రశంసించారు. బీజేపీని ఆశీర్వదించేందుకు వచ్చినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రాంతం ప్రాచీన, పరాక్రమాల గడ్డ అని ప్రధాని కొనియాడారు.

భద్రాచల రామయ్య ఆశీస్సులు మనకు ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకరిస్తోందని వెల్లడించారు. ఇవాళ మోడీ ప్రసంగం గత ప్రసంగాలకు పూర్తి భిన్నంగా సాగింది. బడుగు, బలహీన వర్గాల కోసం బీజేపీ ఎంతో చేసిందని ప్రధాని గుర్తు చేశారు. తెలంగాణలోని ప్రతి పేద, బడుగు, బలహీన వర్గాలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని అన్నారు. కరోనా సమయంలో తెలంగాణ ప్రజల కోసం పాటుపడ్డామని గుర్తుచేశారు. రేషన్‌ సరుకులను, కరోనా టీకాలను ఉచితంగా ఇచ్చామని తెలిపారు. తెలంగాణ ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరుగుతోందని అభిప్రాయపడ్డారు.

Piyush Goyal: మోదీ మార్గదర్శకంలో తెలంగాణలోనూ భాజపా సర్కారు వస్తుంది

2019 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి మద్దతిచ్చారని, అప్పటి నుంచి రాష్ట్రంలో కమలదళం బలపడుతోందని ప్రధాని విశ్లేషించారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఎనిమిదేళ్లుగా ప్రయత్నిస్తున్నాని చెప్పారు. డబుల్‌ ఇంజన్‌ సర్కారు రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నట్లు మోడీ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరిందని సంతోషం వ్యక్తం చేశారు. సభకు హాజరైనవారికి ప్రధాని మోడీ శిరస్సు వంచి నమస్కరించారు. తెలంగాణ గడ్డకు తల వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు.

అధికార పార్టీ టీఆర్‌ఎస్‌పై విమర్శలు ఎక్కుపెట్టకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలపైనే మోడీ ఫోకస్‌ చేశారు. మహిళా సాధికారతకు ముందడుగు వేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సైన్స్‌ సిటీ ఏర్పాటుకు ఎంతో ప్రయత్నిస్తున్నామని తెలిపారు. బయో మెడికల్‌ సైన్సెస్‌ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయని అన్నారు. తెలుగులో టెక్నాలజీ, మెడికల్‌ చదువులు ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించామని ప్రధాని గుర్తు చేశారు. దీంతో దేశంలో ఎరువుల కొరత తీరుతుందని ఆశాభావం వెలిబుచ్చారు.

రైతుల కోసం కనీస మద్ధతు ధర పెంచామని, తెలంగాణలో 5 సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థికంగా అండగా నిలుస్తోందన్నారు. హైదరాబాద్‌కి రీజనల్‌ రింగ్‌ రోడ్‌ కూడా కేటాయించినట్లు మోడీ ప్రస్తావించారు. హైదరాబాద్‌లో 1500 కోట్లతో ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌లు నిర్మించామని తెలిపారు. తెలంగాణలో 5000 కిలోమీటర్ల నేషనల్‌ హైవేలను డెవలప్‌ చేసినట్లు ప్రధాని వివరించారు. మోడీ తన ప్రసంగంలో ఎక్కడా కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ గురించి మాట్లాడకపోవటం విశేషం. తెలంగాణలో మెగా టెక్స్‌ టైల్‌ పార్క్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రం నుంచి భారీగా ధాన్యాన్ని కొన్నామని వెల్లడించారు.

సభ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ భుజం తట్టి మరీ మెచ్చుకున్నారు. ప్రధాని మోడీ ప్రసంగం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. రాజకీయ విమర్శల ఊసెత్తలేదు. బీజేపీ నాయకుడిలా కాకుండా దేశ ప్రధానిగా హుందాగా ప్రసంగాన్ని కొనసాగించటం గమనార్హం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శలకు ప్రధాని సమాధానం ఇస్తారని బీజేపీ శ్రేణులు ఆశించినా దానికి భిన్నంగా ప్రసంగం సాగింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ డెవలప్‌మెంట్‌ కోసం ఏమేం పథకాలను అమలుచేస్తోందో వాటిపైనే ప్రధాని మోడీ గురిపెట్టారు.

Bandi Sanjay : గడీ పాలనను బద్దలు కొట్టి తెలంగాణ తల్లికి విముక్తి చేస్తాం

Exit mobile version