బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని.. ఇదంతా అమిత్‌షా నడుపుతున్న డ్రామా అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కెమెరా ముందు విమర్శలు చేసుకుంటున్నట్టు ఆ రెండు పార్టీలు నటిస్తున్నాయని.. తెరవెనుక చాలా తతంగాలు నడుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌పై అవినీతి ఆరోపణలు చేస్తోన్న అమిత్‌షా.. ఆయనకు ఈడీ నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, ఒకవేళ బీజేపీకి 10 నుంచి 15 సీట్లు వస్తే తాను రాజకీయాలు మానేస్తానని ఛాలెంజ్ చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ‘ధరణి’ తీసుకొచ్చాక రైతులు ఆగం అవుతున్నారని మహేష్ గౌడ్ విమర్శించారు. 2014 తర్వాత కేసీఆర్ కుటుంబ ఒక్కటే బంగారుమయమైందని అన్నారు. ఆదిలాబాద్‌లో వందల ఎకరాల్ని అడ్డగోలుగా కొన్నారని ఆరోపించారు. భూమికి, పేదవాడికి అనుబంధ సంబంధం ఉందని.. కాంగ్రెస్‌కి కూడా భూమితో సంబంధం ఉందని పేర్కొన్నారు. సీలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టి, లక్షల ఎకరాల్ని పంచిన ఘనత తమ కాంగ్రెస్ పార్టీదేనన్నారు. తెలంగాణ సంపదని కేసీఆర్ కొల్లగొడుతున్నారని చెప్పిన మహేష్ గౌడ్.. కమిషన్‌ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను చేపట్టారని ధ్వజమెత్తారు.
కిరాయి కార్లలో తిరిగే కేసీఆర్ కుటుంబానికి.. ఇప్పుడు వందల కోట్ల కార్లు ఎక్కడి నుంచి వచ్చాయని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వచ్చిన కమిషన్ డబ్బుల్ని భూములపై పెట్టుబడి పెట్టి, కేసీఆర్ లక్షల కోట్లకు పడగలెత్తారని ఆరోపణలు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యని తీర్చడంతో పాటు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని హామీ ఇచ్చారు.
