దీపావళి పండుగ వచ్చేసిందంటే చాలు.. ఆఫర్లు, గిఫ్ట్‌ల పేరిట మోసగాళ్లు రకరకాల వలలు విసురుతుంటారు. తాజాగా సోషల్ మీడియాను ముఖ్యంగా వాట్సాప్‌ను వేదికగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు పన్నాగం పన్నారు. పేటీఎం సంస్థ దీపావళి కానుకగా ప్రతి ఒక్కరికీ రూ.1,000 ఇస్తోందంటూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున నకిలీ మెసేజ్‌లు వైరల్ చేస్తున్నారు. ఈ మెసేజ్‌లను చూసి అమాయకులు ఎవరైనా ఉత్సాహంతో క్లిక్ చేస్తే, క్షణాల వ్యవధిలో బ్యాంక్ ఖాతాలు ఖాళీ కావడం ఖాయమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నమ్మకం కలిగించేలా ఫేక్ మెసేజ్‌ల దందా
ప్రజలను మోసపురిత వలలోకి లాగడానికి సైబర్ నేరగాళ్లు కొత్త ప్లాన్‌లు వేస్తున్నారు. ‘నేను మొదట ఇది ఫేక్ అనుకున్నాను.. కానీ నాకు నిజంగానే రూ.1,000 వచ్చాయి, మీరూ ట్రై చేయండి’ అంటూ కొందరు వ్యక్తుల పేరిట ఫేక్ స్క్రీన్‌షాట్లు, మెసేజ్‌లు సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ మాటలు నమ్మి ప్రజలు ఆ లింక్‌లపై క్లిక్ చేయాలని, ఆ తర్వాత వారి వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు దొంగిలించడమే ఈ ముఠాల ప్రధాన లక్ష్యం. పండుగ ఉత్సాహంలో ఉండే ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు.
హైదరాబాద్ పోలీసుల కీలక హెచ్చరిక
ఈ ఫేక్ ఆఫర్ల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్ తీవ్రంగా హెచ్చరించారు. పండుగ సమయాలను, ప్రత్యేక ఆఫర్ల ఉత్సాహాన్ని కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని, బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీఎం పిన్ నంబర్లు, ఓటీపీలు (OTPs) లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు. అలాగే, ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను సరిచూసుకోకుండా ఇతరులకు ఫార్వార్డ్ చేయవద్దని సూచించారు.
అధికారిక వెబ్‌సైట్లలోనే ధృవీకరించుకోవాలి
ఏదైనా ప్రమోషనల్ ఆఫర్ వస్తే అది నిజమో కాదో తెలుసుకోవడానికి కేవలం పేటీఎం అధికారిక వెబ్‌సైట్ లేదా వారి అధీకృత కమ్యూనికేషన్ ఛానెళ్ల ద్వారా మాత్రమే తనిఖీ చేసుకోవాలని పోలీసులు తెలిపారు. పండుగ ఆఫర్ల పేరుతో వచ్చే ఆకర్షణీయమైన మెసేజ్‌లన్నీ నిజం కాదని, ఒక్క క్షణం నిర్లక్ష్యం చేసినా మీ కష్టార్జితం మొత్తం క్షణాల్లో మాయమవుతుందని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా ఈ సైబర్ మోసాల బారిన పడితే వెంటనే అప్రమత్తమై జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేయాలని, లేదా www.cybercrime.gov.in పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

