తెలంగాణ రాజకీయ నేతలపై పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ నేతలు రాజకీయ విమర్శలను కళారంగానికి అంటనీయరని పవన్ కొనియాడారు. తెలంగాణ నేతలు అందుకే ప్రత్యేకంగా నిలుస్తారని తెలిపారు. సృజనాత్మకత, సాంకేతికతల మేళవింపుతో కొనసాగే సినిమా రంగాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారని.. కళను అక్కున చేర్చుకుని అభినందించడానికి ప్రాంతీయ కుల, మత భేదాలు ఉండవని తెలియజెప్పినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పవన్ ప్రకటించారు.
ఒకవైపు బయో ఏషియా సదస్సులో బిల్‌గేట్స్‌తో కీలకమైన వర్చువల్ భేటీ ఉన్నా వీలు చేసుకుని మంత్రి కేటీఆర్ ఈవెంట్‌కు వచ్చారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. రాజకీయ విమర్శలను కళలకు, సంస్కృతికి అంటనీయకపోవడం తెలంగాణ రాజకీయ నేతల శైలిలో ఉందని, అది కేటీఆర్‌లో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని పవన్ అభిప్రాయపడ్డారు. కాగా తెలంగాణ నేతలను అభినందిస్తూ ఏపీ ప్రభుత్వ నేతల స్వభావాన్ని పవన్ చెప్పకనే చెప్పారని ఆయన అభిమానులు భావిస్తున్నారు.
