Site icon NTV Telugu

శెభాష్ మొగిల‌య్య‌.. కిన్నెర మెట్ల‌కు ప‌ద్మ‌ శ్రీ‌ పుర‌స్కారం..

ఈ ఏడాది 128 మందికి పద్మ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది కేంద్ర ప్ర‌భుత్వం.. ప‌ద్మ అవార్డుల తుది జాబితాకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయ‌డంతో.. ఆ జాబితాను ఇవాళ కేంద్ర హోంశాఖ విడుద‌ల చేసింది.. న‌లుగురికి పద్మవిభూషన్, 17 మందికి పద్మభూషన్, 107 మందికి పద్మశ్రీ అవార్డులు ద‌క్కాయి.. ఇక‌, తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురిని ప‌ద్మ అవార్డులు వ‌రించాయి.. అందులో మొగిల‌య్య ఒక‌రు.. ఆయ‌నే తెలంగాణ రాష్ట్రానికి చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు మొగిల‌య్య‌.. సహజంగానే మొగిలయ్య గొంతు ఒక మాధ్యమం.. అది అట్ట‌డుగు ప్రజలది.. అనాది లోతుల్లోంచి పెగులుతుంది.. వేదనను చెదరగొడుతూ దుఖాన్ని దూరం చేస్తూ ఒక వీరుడి రాకను ప్ర‌క‌టిస్తుంది.. ఆయ‌న‌కు ఎన్నో పుర‌స్కారాలు, స‌త్కారాలు అందినా.. ఇప్పుడు అరుదైన పురస్కారంతో అభిషేకం జ‌ర‌గ‌బోతోంది..

Read Also: తెలుగు ప‌ద్మాలు వీరే..

తెలంగాణ‌కు చెందిన కిన్నెర మొగిల‌య్య స్వ‌గ్రామం నాగర్‌కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకుల.. 1951లో జన్మించిన ఆయన పూర్తి పేరు దర్శనం మొగులయ్య… ఆయ‌న పూర్వికులు కూడా కిన్నెర మెట్ల క‌ళాకారులే.. గ‌తంలో 9 మెట్ల‌కు ప‌రిమిత‌మైన కిన్నెర‌ను.. ఆయ‌న‌ 12 మెట్లకు తెచ్చారు.. ఆయన 52 దేశాల ప్రతినిధుల ముందు తన 12 మెట్ల కిన్నెర గానంతో ప్రదర్శలను ఇచ్చారు. మొగులయ్య జీవిత చరిత్ర ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా చేర్చి ఆయ‌న‌ను గౌర‌వించింది ప్ర‌భుత్వం.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఉగాది విశిష్ట పురస్కారాన్ని అందుకున్న మొగిల‌య్య‌కు.. ఇప్పుడు పద్మశ్రీ పురస్కారం ద‌క్కింది. ఇక‌, ఆయ‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు, పుర‌స్కారాల‌తో ప్ర‌త్యేక గుర్తింపు ఉన్నా.. ఈ మ‌ధ్య ‘భీమ్లా నాయక్’ చిత్రంలో ఆయ‌న పాడిన పాట మ‌రింత గుర్తింపు తెచ్చిపెట్టింది…

12 మెట్ల కిన్నెర వాయిస్తూ పండుగల సాయన్న, పానుగంటి మీరాసాహెబ్, ఎండబెట్ల ఫకీరయ్య గౌడ్, బండోళ్ల కురుమన్న, వట్టెం రంగనాయకమ్మ, వనపర్తి రాజుల కథలు వంటి తెలంగాణ వారి వీరగాథలు తన వాద్యంతో వినిపించే మొగులయ్య.. భీమ్లా నాయ‌క్‌లో పాట‌తో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు.. ఆ సినిమాలోని టైటిల్ సాంగ్‌కు ముందు.. ‘‘ఆడ గాడు ఈడ గాదు అమీరొళ్ల మేడా గాదుగుర్రం నీళ్ల గుట్టా కాడా అలుగువాగా వాగా తండాలోనిబెమ్మ జెముడు చెట్టు నది బెమ్మ జెముడు చెట్టు కింద అమ్మ నొప్పులు పడతన్నాది ఎండ లేదు రాతిరి కాదుఎగుసుక్కా పొడవంగానే పుట్టిండాడు పులి పిల్లపుట్టిండాడు పులి పిల్ల నల్లమల్ల తాళ్ళుకాల అమ్మ పేరు మీరాబాయి నాయన పేరు సోమలగండునాయన పేరు సోమలగందు తాత పేరు బహదూర్ముత్తాల తాత ఈరా నాయక్ పెట్టిన పేరు భీమ్లా నాయక్‌.. శెభాష్ భీమ్లా నాయ‌కా’’.. అంటూ ఆయ‌న గొంతు నుంచి వ‌చ్చిన పాట‌కు శెభాష్ మొగిల‌య్య అంటూ కీర్తించారు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్.. ఈ పాట త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ క‌ల్యాణ్ ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా ఆర్థిక సాయం కూడా చేసిన విష‌యం తెలిసిందే..

Exit mobile version