చాలా ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు వడ్లను సేకరించి..మర పట్టించిన తరువాత తమకు అవసరం ఉన్నంత మేర ఉంచుకుని మిగతా బియ్యాన్ని కేంద్రానికి పంపిస్తున్నాయి. అలా రైతుల నుంచి రాష్ట్రాలు సేకరించిన మొత్తం ధాన్యానికి కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. ఆ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లలో నిల్వ చేస్తుంది. ప్రస్తుతం మన దగ్గర వచ్చే మూడేళ్ల అవసరాలకు సరిపడ ధాన్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి బియ్యం కొనుగోలు చేయడం సాధ్యంకాదని కేంద్రం చెప్పటంతో తెలంగాణలో పంచాయతీకి తెరలేసింది. రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతున్న క్రమంలో కేంద్రం నిర్ణయంతో తెలంగాణలో రాజకీయ రగడకు కారణమైంది. వరి సేకరణ అంశంపై టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఇప్పుడు పెద్ద యుద్ధమే జరుగుతోంది.
ప్రస్తుతం తెలంగాణలో యాసంగి పంట కోతకొచ్చింది. కొద్ది రోజులలో కోతలు కూడా పూర్తవుతాయి. కానీ ఇప్పటి వరకు కొనుగోళు వ్యవహారం కొలిక్కి రాలేదు. ఇది రైతులకు ఆందోళన కలిగించే విషయం కావటంతో కేంద్రపై రాష్ట్రం మరింత వత్తిడి పెంచింది. యాసంగి పంట మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా డిమాండ్ చేస్తోంది. సీఎం కేసీఆర్ స్వయంగా ఢిల్లీ వెళ్లి నిరసన దీక్ష చేపట్టారు. ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి కల్పించారని మోడీ సర్కార్‌పై కేసీఆర్ మండిపడ్డారు.
మరోవైపు, టీఆర్‌ఎస్ ఎన్ని ఆందోళనలు చేసినా…ఎన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టినా కేంద్రం మాత్రం పారా బాయిల్డ్ రైస్ కొనే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేసింది. దాంతో ఇప్పుడు వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తారా ..లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సాగు భూమి విస్తీర్ణం పెరిగింది. దాదాపు 60 లక్షల ఎకరాలలో వరి సాగవుతోంది. వరిపంటలో తెలంగాణ నెంబర్ వన్ అయింది. గత సీజన్‌లో రికార్డు స్థాయిలో కోటి టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయింది. నిజానికి, వరి ప్రధానంగా ఖరీఫ్ పంట. కానీ తెలంగాణ వాతావరణ పరిస్థితులు రబీలో వరిసాగుకు కూడా అనుకూలిస్తాయి. దాంతో యాసంగిలోనూ రైతులు వరి సాగుకు మొగ్గు చూపిస్తున్నారు. అదే ఇప్పుడు సమస్యగా మారింది.
యాసంగి పంట ముడి బియ్యానికి పెద్దగా అనుకూలించదు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా మరపట్టించేప్పుడు వడ్లు విరిగిపోయి నూక అధికంగా ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే వడ్లను నేరుగా మర పట్టిస్తే వచ్చే బియ్యాన్ని రా రైస్ (ముడి బియ్యం) అంటారు. వడ్లను ఉడికించి ఆ తర్వాత మిల్లింగ్ చేస్తే అది బాయిల్డ్ రైస్. తెలంగాణలో వానాకాలం (ఖరీఫ్ సీజన్) పంటను ముడి బియ్యం, యాసంగి (రబీ) ధాన్యంతో బాయిల్డ్ రైస్ ఉత్పత్తవుతోంది.
బాయిల్డ్ రైస్ కోసం ధాన్యాన్ని మిల్లింగ్ చేసే ముందు 85-90 డిగ్రీల నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద వేడి నీటిలో ఉడికించి ఆరబోస్తారు. తరువాత 15 శాతం తేమ వద్ద మిల్లింగ్ చేస్తారు. అప్పుడు బియ్యంలో నూక శాతం తగ్గుతుంది. అదే రా రైస్ చేస్తే బియ్యం 20 శాతానికి మించి రాదు. ఈ కారణం వల్ల గత ఇరవై ఏళ్లుగా యాసంగి వడ్లను ఉడకబెట్టి పార్‌బాయిల్డ్ రైస్‌గా మార్చి నిల్వ చేస్తున్నారు. ఇప్పుడు దేశంలో పార్‌బాయిల్డ్ వినియోగం గణనీయంగా తగ్గింది. ఒకప్పుడు కేరళ, తమిళనాడు,అస్సాం, పశ్ఛిమబెంగాల్‌తో పాటు పొరుగు దేశాలు శ్రీలంక,బంగ్లాదేశ్‌లలో బాయిల్డ్ రైస్ వినియోగం ఎక్కువగా ఉండేది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అంతగా లేదు. రా రైస్‌తో పోలిస్తే ఇందులో పోషకాలు ఎక్కువ.
బాయిల్డ్ రైస్ వినియోగ రాష్ట్రాలు చాలా వరకు వరి ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాయి. అంతే కాకుండా ఈ రకం బియ్యానికి విదేశాల్లో కూడా పెద్దగా డిమాండ్ లేదని కేంద్రం అంటోంది. కనుక , యాసంగి వరి ధాన్యాన్ని రా బియ్యం రూపంలో ఇవ్వాలని కేంద్రం అంటోంది. ఈ విషయంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరిందని కూడా అంటున్నారు. ఇక మీదట పారా బాయిల్డ్ రైస్ సరఫరా చేయబోమని తెలంగాణ ప్రభుత్వం లేఖ ఇచ్చిందని నిరుడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో ప్రకటించారు.
దేశ ప్రజలకు ఆహార భద్రత, రైతులకు కనీస మద్దతు ధర లక్ష్యంగా ‘భారత ఆహార సంస్థ- ఎఫ్‌సీఐ ఏర్పాటైంది. ఇది ప్రధానంగా బియ్యం, గోధుమలను సేకరించి గోడౌన్లలో భద్రపరుస్తుంది. బియ్యం ఎక్కువగా పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి సేకరిస్తోంది. దానిని ప్రతి నెలా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీ ధరకు పేదలకు అందిస్తుంది. ప్రస్తుతం ఎఫ్‌సీఐ ద్వారా ముడి బియ్యం మాత్రమే సేకరిస్తామన్న కేంద్ర నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ధాన్యం సేకరణలో కేంద్రం తన విధానం స్పష్టం చేయడంతో, భవిష్యత్తులో రబీ ధాన్యం సేకరణలో ఎదుర్కోబోయే ఇబ్బందుల దృష్ట్యా, యాసంగిలో వరి బదులు ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. పప్పు దినుసులు, నూనెగింజలు, అపరాలు, కూరగాయలవంటి ఇతర పంటలు సాగుచేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. కానీ రైతులు మాత్రం వరి సాగువైపు మొగ్గు చూపారు. ప్రత్యామ్నాయ పంటల విక్రయానికి మార్కెటింగ్, మద్దతు ధర వంటి అంశాలపై రైతులకు అనేక అనుమానాలున్నాయి. అంతేగాక రాష్ట్రంలో వరి సాగుకు తగిన సాగు నీరు, విద్యుత్ అందుబాటులో ఉన్నాయి. ఈ పరిస్థితిలో ప్రత్యామ్నాయ పంట సాగుకు రైతులను ఒత్తిడికి గురిచేస్తే రాజకీయంగా నష్టపోతామని నాడు కేసీఆర్ భావించి వుండవచ్చు.
ఈ మొత్తం వ్యవహారంలో రైతుల తప్పేమీ లేదు. మద్దతు ధర వస్తుంది కాబట్టి యాసంగి లో కూడా రైతులు వరి సాగు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్లేమ్ గేమ్ ఆడుతూ చివరకు రైతులను రోడ్డున పడేయాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఇకనైనా కేంద్రం, రాష్ట్రం ఒక అవగాహనకు వచ్చి యాసంగి పంటను కొనేలా చర్యలు తీసుకుంటే మంచిది.
