Site icon NTV Telugu

Sonu Sood: సోనూసూద్‌ ఫౌండేషన్‌ పేరుతో టోకరా.. రూ.68వేలు దోపిడీ

Fraud

Fraud

కరోనా సమయంలో నటుడు సోనూసూద్ తన ఫౌండేషన్ ద్వారా ఎంతో పేదలకు సహాయం అందించి రియల్ హీరోగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో ఓ వ్యక్తి తాజాగా రూ.68 వేలు దోచుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడ శ్రీనివాసపురం కాలనీకి చెందిన పి.సంధ్య(36) అనే మహిళ బంధువుల్లో ఒకరికి కేన్సర్‌ చికిత్స కోసం డబ్బు అవసరమైంది. దీంతో ఆమె గత్యంతరం లేని పరిస్థితుల్లో ట్విటర్‌లో సోనూసూద్‌ ఫౌండేషన్‌ను ఆశ్రయించింది.

Vikarabad: సెలవు ప్రకటించుకున్న డాక్టర్లు.. రోగుల అవస్థలు

ఈ నేపథ్యంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి తాను సోనూసూద్ ఫౌండేషన్ నుంచి కాల్ చేస్తున్నానంటూ సదరు మహిళకు ఫోన్ చేశాడు. బంధువు వివరాలు అడిగినట్లు అడిగి.. మొబైల్‌లో ఎనీడెస్క్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించాడు. ఆ తర్వాత ఫోన్‌పే యాప్‌లోకి వెళ్లి బ్యాంకు డెబిట్‌ కార్డును రెండు వైపులా స్కాన్‌ చేయాలని సూచించాడు. అయితే సదరు వ్యక్తి చెప్పినట్లే సంధ్య చేసింది. అనంతరం తమ ఫౌండేషన్‌ నుంచి డబ్బు పంపిస్తామని, మొబైల్‌కు వచ్చే ఓటీపీ చెప్పాలని వ్యక్తి సూచించాడు. సంధ్య తన మొబైల్‌కు వచ్చిన ఓటీపి చెప్పగానే ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి మూడుసార్లుగా రూ.68వేలు బదిలీ అయ్యాయి. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి వివరాలను సేకరిస్తున్నారు.

Exit mobile version