NTV Telugu Site icon

కేసీఆర్ ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది : బండి సంజయ్

సీఎం కేసీఆర్ పై మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవకాశావాదానికి పరాకాష్ట కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మాటలు వింటే నాకంటే ఎక్కువ రంగులు మార్చేటోడు కూడా ఉన్నడా? అని ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఆయన విమర్శించారు. అంతెందుకు… సరిగ్గా 6 ఏండ్ల కింద అంటే 2016 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని ఆయన అన్నారు. సరిగ్గా ఏడాదిలో అంటే 2017లో అంబేద్కర్ జయంతి నాటికి 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తానన్నడని, ఇక ఆ తరువాత ఆ ఊసే లేదు అని ఆయన మండిపడ్డారు.

ఆనాటి నుండి అంబేద్కర్ జయంతి, వర్దంతి కార్యక్రమాలకు కూడా వెళ్లని మూర్ఖుడు కేసీఆర్ అని ఆయన అన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏమైందంటూ… బీజేపీ తరపున మేమంతా… అట్లాగే దళిత, ప్రజా సంఘాల నాయకులంతా పదేపదే ఒత్తిడి తేవడంతో 4 ఏళ్ల తరువాత అంటే 2020 సెప్టెంబర్ 17న రూ.146 కోట్ల నిధులు విడుదల చేసింది. అయినా నేటికీ విగ్రహ పనులు పూర్తికాలేదు. ఈ పనులు అసలు పూర్తవుతాయో లేదో… కూడా తెల్వని పరిస్థితి. 125 అడుగుల విగ్రహం అన్నడు… ఇక్కడికి వచ్చి చూస్తే 45 అడుగులకు మించి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కన్పించడం లేదు. కేసీఆర్ ను నేనడుగుతున్నా… నువ్వుండే ప్రగతి భవన్ ను ఏడాదిలో నిర్మించుకుని కులుకుతున్నవ్. ఉన్న సెక్రటేరియట్ ను కూల్చేసి జనం సొమ్ము ఖర్చు చేసి రూ.800 కోట్లతో కొత్త సెక్రటేరియట్ ను కడుతున్నవ్ అని ఆయన అన్నారు.