Site icon NTV Telugu

Ola Cabs Fined By Court: 4 కి.మీ. దూరానికి రూ.861 ఛార్జ్ చేసినందుకు రూ.95 వేలు జరిమానా

Ola Cabs

Ola Cabs

Ola Cabs Fined By Court: ప్రస్తుత రోజుల్లో ఒక ఫ్యామిలీ బయటకు వెళ్లాలంటే కారు ఉండాల్సిందే. అయితే సొంత కారు లేని వాళ్లు క్యాబ్‌లపై ఆధారపడుతున్నారు. దీంతో ఓలా లేదా ఉబర్ క్యాబ్‌లను బుక్ చేసుకుంటున్నారు. కానీ ఓలా, ఉబర్‌లు సామాన్యులను పిండి పిప్పి చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓలా క్యాబ్స్‌కు హైదరాబాద్ వినియోగదారుల కోర్టు భారీ జరిమానా విధించింది. కేవలం 4-5 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఓ కస్టమర్‌కు ఓలా క్యాబ్స్ ఇటీవల రూ. 861 బిల్లు వేసింది. దీంతో అతడు వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశాడు.

Read Also: Hyderabad: ‘గాంధీ’ సినిమాకు వచ్చి గాంధీగిరి.. థియేటర్ ధ్వంసం చేసిన విద్యార్థులు

వివరాల్లోకి వెళ్లే.. 2021 అక్టోబర్‌లో శామ్యూల్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి బయటకు వెళ్లేందుకు ఓలా క్యాబ్ ఎక్కాడు. వీళ్లిద్దరూ కేవలం 4-5 కిలో మీటర్లు ప్రయాణించారు. అయితే క్యాబ్‌ డ్రైవర్ ప్రవర్తన బాగోలేదని , ఏసీ వేయాలని కోరినప్పటికీ పట్టించుకోలేదని శామ్యుల్ ఆరోపించాడు. అంతేకాకుండా తక్కువ దూరానికి రూ. 861 ఛార్జ్ చేశాడని వివరించాడు. వ్యాలెట్‌లో ఉన్న ఓలా మనీని తీసుకోవడానికి కూడా డ్రైవర్ నిరాకరించాడని.. డబ్బు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశాడని వివరించాడు. కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసినా ఓలా యాజమాన్యం తనకు న్యాయం చేయలేదని బాధితుడు శామ్యూల్ తెలిపాడు. దీంతో శామ్యూల్ ఫిర్యాదుపై హైదరాబాద్ వినియోగదారుల కోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు కోర్టు ఫీజుల కింద రూ. 7వేలు, నష్టపరిహారం రూ.88వేలు ఇవ్వాలని.. మొత్తం రూ.95 వేలు జరిమానా చెల్లించాలని ఓలాను ఆదేశించింది. అంతేకాదు ఫిర్యాదుదారుడి నుంచి వసూలు చేసిన రూ. 861 ఛార్జీని కూడా 12 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version