Site icon NTV Telugu

Off The Record : నారాయణపేటలో ఆసక్తికర రాజకీయం..మేనకోడలు పేరు చెప్పి మేనమామ దందాలు !

Mahabubnagar

Mahabubnagar

ఆమె తన మేనమామే కదా అని వదిలేసినట్టుంది. ఆయనేమో తన మేనకోడలు ఎమ్మెల్యే అంటూ తెగ రెచ్చిపోతున్నారు. నియోజకవర్గానికి తానే కింగ్‌ మేకర్‌ అంటూ పోజులు కొడుతున్నారు. మరి…అక్కడ కోడలు ఎమ్మెల్యే అయితే మామ పెత్తనమే కొనసాగుతోందా?వందా యాభై చందాల నుంచి మొదలుపెట్టి రాజకీయ దందాలు చేస్తున్నదెవరు?ఇంతకీ…ఎవరా మామా కోడళ్లు?ఆ జిల్లాలో ఆ నియోజకవర్గం పేరే ఎందుకు ప్రముఖంగా వినిపిస్తోంది?

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట అసెంబ్లీ పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నికల వేళ అనూహ్యంగా తెరపైకి వచ్చి ఎమ్మెల్యేగా విజయం సాధించారు డాక్టర్ పర్ణికా రెడ్డి. ఆమె కుటుంబ నేపథ్యం పొలిటికల్‌గా బలమైందే. అయినప్పటికీ ఆమెకు మాత్రం రాజకీయాలు కొత్త. కొన్నేళ్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలనే కోరికతో ఉన్న కుంభం శివకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పర్ణికా రెడ్డికి మేనమామ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. మారిన పరిణామాలతో తాను సైడైపోయి…డాక్టర్ వృత్తిలో ఉన్న మేనకోడలు పర్ణికా రెడ్డిని రంగంలోకి దించారు.

ఇక…ఇప్పుడు పర్ణికారెడ్డిని అన్నీ తానై ఎమ్మెల్యేగా గెలిపించిన శివకుమార్ రెడ్డి నియోజకవర్గాన్ని అంతా తన గుప్పిట్లో పెట్టుకొని శాసిస్తున్నట్లు లోకల్ టాక్. తాను ఏ పదవిలో లేకున్నా నారాయణపేటలో శివకుమార్ రెడ్డి కింగ్ మేకర్‌గా మారిపోయారట. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప ఏ పనీ కాదని క్యాడర్, ముఖ్యకార్యకర్తలు సైతం చెప్పుకుంటూ ఉంటారని తెలుస్తోంది. శివకుమార్ రెడ్డి ఫోన్ వెళ్లనిదే అధికారులు ఎవరూ పని చేయరని కాంగ్రెస్ శిబిరంలోని నేతలు చర్చించుకుంటున్నారట. శివకుమార్ రెడ్డికి వ్యక్తిగత సహాయకుడు అరుణ్ సైతం దందాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

పర్ణికా రెడ్డి గెలుపొందిన వెంటనే…నియోజకవర్గ పరిధిలో ఇల్లీగల్ దందాలన్నింటిపైనా శివకుమార్ రెడ్డి మనుషులు వాలిపోయినట్లు తెలుస్తోంది. ఇసుక అక్రమంగా తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరికల్ మండలంలోని వాగు నుంచి, రాకొండ, పూసలపాడ్ గ్రామాల నుంచి ఇసుక కొల్లగొట్టడంలో శివకుమార్ రెడ్డి అనుంగు శిష్యుడు అరుణ్‌దే కీలక పాత్ర అని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ధన్వాడ పెద్ద చెరువు నుంచి ఒండ్రు మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటుక బట్టీలు అమ్మి సొమ్ము చేసుకోవడంలో పీఎస్ మాధవరెడ్డిది కీ రోల్ అని తెలుస్తోంది. ఆయా మండలాల్లో కల్లు దందా అంతా ఆయన అనుచర వర్గమే చేస్తున్నట్లు సమాచారం.

మరోపక్క పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి ధాన్యం తీసుకొచ్చి నారాయణపేట మార్కెట్‌లో అమ్మి బోనస్‌ను సొమ్ము చేసుకోవడంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి కీలకమనే ప్రచారం నడుస్తోంది. ఈ వ్యవహారాలన్నీ కూడా శివకుమార్ రెడ్డి కనుసన్నల్లోనే సాగుతాయట. ఆయన అండదండలు లేకుంటే ఇలాంటి పనులు అసాధ్యమని కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. నారాయణపేటలో పోలీసు, రెవెన్యూతో పాటు పలు కీలక శాఖలను శివకుమార్ రెడ్డి శాసిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ నిర్ణయమైనా అధికారులు శివకుమార్ రెడ్డినే కాంటాక్ట్ అవుతున్నారట. ఆయా పీఎస్‌లకు ఎస్ఐలుగా శివకుమార్ రెడ్డి సూచించిన వాళ్లనే నియమించినట్లు తెలుస్తోంది. సెటిల్మెంట్లు సైతం ఆయన కనుసన్నల్లోనే సాగడం పరిపాటిగా మారిందనేది నారాయణపేట నియోజకవర్గ ప్రజల మాట.

అసెంబ్లీ ఎన్నికల్లో పర్ణికారెడ్డి 7 వేల 951 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమె కుటుంబ రాజకీయ నేపథ్యం…శివకుమార్ రెడ్డి అన్ని తానై నడిపించడంతో విజయం ఆమె సొంతం అయ్యింది. దీనికి తోడు రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటి చేసి రెండో స్థానానికి పరిమితమైన శివకుమార్ రెడ్డిపై సింపతీ కూడా పర్ణికారెడ్డికి కలిసొచ్చినట్లు చెప్పవచ్చు.

మొత్తం మీదా నారాయణపేట నియోజకవర్గానికి తానే ఎమ్మెల్యే అన్నట్లుగా ఏలుతున్నారట శివకుమార్ రెడ్డి. ఆయన సూచనలతోనే ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి…శివకుమార్ రెడ్డి అండ్ టీం మా టైమ్‌ వచ్చిందన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

Exit mobile version