Site icon NTV Telugu

Bandi Sanjay: తెలుగు రాష్ట్రాల రాజకీయాలనే మలుపు తిప్పిన నాయకుడు ఎన్టీఆర్

Bandi Sanjay

Bandi Sanjay

తెలుగు జాతి గర్వించదగ్గ మహా నటుడు పద్మశ్రీ నందమూరి తారకరామారావు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలనే మలుపు తిప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా బీజేపీ తెలంగాణ శాఖ తరపున ఆయనకు ఘన నివాళి అర్పించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. పౌరాణికం మొదలు జానపదం, జేమ్స్ బాండ్ సినిమాల వరకు అన్ని రకాల పాత్రలు పోషించి తెలుగు సినిమా రంగాన్ని ఐదు దశాబ్దాలపాటు ఉర్రూతలూగించిన ఆణిముత్యం అంటూ బండి సంజ‌య్ అన్నారు. శ్రీక్రుష్ణుడిగా, రాముడి వంటి దేవుళ్ల పాత్రలే కాకుండా ఏ హీరో సాహసం చేసేందుకు ఇష్టపడని ధుర్యోధనుడు, రావణాసురుడు వంటి విలన్ పాత్రలతోపాటు బ్రుహన్నల వంటి హిజ్రా పాత్రలను సైతం పోషించి మెప్పించిన మహా నటుడని గుర్తు చేసుకున్నారు.

రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసి 80వ దశకంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలనే మలుపు తిప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకే కిలోబియ్యం వంటి సంక్షేమ పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే పేదల సంక్షేమం కోసం ఆయన ఎంతగా పరితపించారో అర్ధం చేసుకోవచ్చని అన్నారు.

ఎన్టీఆర్ జ్ఝాపకాల గుర్తుగా ఏర్పాటు చేసిన ‘ఎన్టీఆర్ ఘాట్’ ను కూల్చేస్తామని మజ్లిస్ వంటి కుహానాశక్తులు గతంలో కుట్రలు చేయడం హేయనీయమైన చ‌ర్య అని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఘాట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని బండి సంజ‌య్ అన్నారు. ఆ మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా బీజేపీ తెలంగాణ శాఖ తరపున ఘన నివాళి అర్పిస్తున్నామని బండి సంజయ్ ఈ సందర్భంగా తెలిపారు.

Jagadish Reddy: వరి దిగుబడిలో ‘తెలంగాణ’ పంజాబ్‌ను అధిగమించింది

Exit mobile version