NTV Telugu Site icon

TRS: కేసీఆర్ జాతీయ రాజకీయాలకు ఎన్నారైల మద్దతు

Untitled 1 Copy

Untitled 1 Copy

జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రావడాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు తమ అధినేత నిర్ణయానికి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా.. టీఆర్ఎస్ పార్టీ మాత్రం తమ అధినేత దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కోరుకుంటున్నారు.

తాజాగా కేసీఆర్ నిర్ణయానికి ఎన్నారైలు మద్దతు ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వం జాతీయ రాజకీయాలకు అవసరం అని వారంతా అన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వం అవసరంపై తెలంగాణ ఎన్నారై మహేష్ బిగాల ప్రపంచ దేశాల్లో ఉన్న ఎన్నారైలతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఇందులో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ అవసరంపై మహేష్ బిగాల ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణకు చెందిన ఎన్నారైలు ఏకగ్రీవంగా ఆమోదించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి( టీఆర్ఎస్) త్వరలోనే భారత రాష్ట్ర సమితి( బీఆర్ఎస్) గా మారుబోతున్న నేపథ్యంలో ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రపంచదేశాల్లోని ఎన్నారైలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ గారి నాయకత్వం అవసరం అని అందరు ఎన్నారైలు ముక్తకంఠంతో కేసీఆర్ నాయకత్వాన్ని స్వాగతించారు.

రాదనుకున్న తెలంగాణను ఎన్నో ఉద్యమాలు చేసి అందరిని ఏకం చేసి తెచ్చిన నాయకుడు కేసీఆర్ అని.. ఆయన మార్గదర్శనంలో తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని ఎన్నారైలు సమావేశంలో అన్నారు. బంగారు తెలంగాణను తీర్చిదిద్దిన సమయంలో దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో అందరిని కలుపుకుపోతే కీలక పాత్ర పోషిస్తారనే నమ్మకం ఉందని అన్నారు.

భారత దేశంలో అపారమైన వనరులున్నా వాటిని వాడుకునే నైపుణ్యాలు కేంద్రాన్ని నడుపుతున్న ప్రభుత్వాలకు లేవని.. వారికి ప్రజల పట్ల నిబద్ధత లేకుండా పోయిందని విమర్శించారు. మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడమే కానీ.. ప్రజలకు అవసరమైన ఎజెండా ఏమీ వారు అమలు చేయడానికి సిద్దంగా లేరని ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ లో సమావేశాల్లో ప్రజల అవసరాలపై మాట్లాడకుండా జైశ్రీరాం నినాదాలతో అడ్డుకుంటన్నారని విమర్శించారు. తెలంగాణ వంటి ఆదర్శవంతమైన పాలన తీసుకురావాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సిందే అని ఎన్నారైలు అంతా ఏకగ్రీవంగా మద్దతు పలికారు.