NTV Telugu Site icon

NREGA Scheme: ఉపాధి హామీ కాదు …అవినీతికి హామీ పథకం

ఉపాధి హమీ పథకం నిధులను పక్కదారి పట్టించారు..కొన్ని చోట్ల రాజకీయ నాయకులు,అధికారులు కలిసి కొంతమెక్కేస్తే మరికొన్నిచోట్ల ఈజీఎస్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి నిధులను మింగేసారు. చనిపోయిన వాళ్లు పనిచేసినట్టు రికార్డ్ చేసారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన అవినీతి ఎంత? ఇందులో ఎవరి పాత్ర ఎంత? రాజకీయ రచ్చకు దారితీస్తున్న ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

ఆదిలాబాద్ జిల్లా జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం నిధులను దిగమింగుతున్నారు. కొన్నిచోట్ల చేయని పనులకు బిల్లులు లేపేస్తే మరికొన్నిచోట్ల పని చేయకున్నా వారి పేర్ల మీదు డబ్బులు డ్రా అయ్యాయి. అంగన్ వాడీ కార్యకర్తలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగి అకౌంట్లలో ఉపాధి హామీ డబ్బులు వేయడం కలకలం రేపింది.ఇలాఎన్నో చిత్ర విచిత్రాలు జరిగినట్టు సామాజిక తనిఖీ (Social Audit) లో వెల్లడైంది. ఏటా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కోట్ల రూపాయలు అవినీతి జరగుతుంటే సిబ్బందిని సస్పెండ్ చేసిన వదిలేస్తున్నారు తప్ప రికవరీపై పూర్తి స్థాయి దృష్టిసారించడంలేదు..

తాజాగా చూస్తే జిల్లాలోని బోథ్​ మండలం లోని ఉపాధి హామీ పనుల్లో అవీనితిని సామాజిక తనిఖీ చేసిన టీం ప్రజావేదికలో నిధులు మళ్లించిన తీరును ఆధారాలో సహా వెల్లడించారు. పని చేయకుండానే బిల్లులు లేపిన వైనం బయటపడింది. చనిపోయిన వారిపైన, అంగన్​వాడీ కార్యకర్తలు, ఆయాల పైన బిల్లులు లేపడం, ప్రభుత్వ ఉద్యోగి పేరుపైన బిల్లులు చేయడం వంటి అక్రమాలు బయట పడ్డాయి. ఇదే విషయంపై ఇటీవల జరిగిన సమావేశంలో పలువురు సర్పంచ్​లు, ప్రజా ప్రతినిధులు అధికారులను నిలదీసారు..అయితే వీటన్నింటిపై అధికారులు మిన్నకుండిపోయారు..

రాందాస్​ అనే ప్రభుత్వ ఉద్యోగి కేవలం పార్డి‘కె’ పంచాయతీ పరిధిలోని చేసిన పనుల బిల్లులు తన అకౌంట్లో పడడంతో వెలుగులోకి వచ్చింది.. రఘునాథ్​పూర్​, పార్డి’కె‘, అందూర్​, సాకెర, చింతల్​బోరి పంచాయతీల్లో దాదాపు రూ.30 లక్షల వరకు అవినీతి జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. ఇందులో ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్ లను సస్పెండ్ సైతం చేశారు..అయితే మండలం లో జరిగిన అవినీతిపై ఏకంగా కమిషనర్ కు సైతం ఫోన్ లో ఫిర్యాదు చేశారు స్థానికులు.

2019, 2020, 2021 సంవత్సరాల పనులకు సంబంధించిన రూ.24 కోట్ల పనుల వివరాలను ఆడిట్​ చేయగా అందులోని నివేదికను ప్రజావేదికలో బయటపెట్టారు. పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీలకు సరఫరా చేసిన సీడ్స్​, నేమ్​ బోర్డ్​ల బిల్లులను స్థానిక ఎంపీడీఓ రాథోడ్​రాధ భర్త రామ్​దాస్​ పేరుపై లేపినట్లు ప్రజా వేదికలో గుర్తించారు. రామ్​దాస్​ ఒక ప్రభుత్వ ఉద్యోగి అని నిర్మల్​కు చెందిన ఆయన పేరుమీద బిల్లులు ఎలా చెల్లిస్తారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయం పై అధికారుల వద్ద ఎలాంటి సమాధానం లేదు.

ధన్నూర్​’బి‘ పరిధిలో దేవునిగుట్ట వద్ద పనులు చేయకుండా రూ.23 లక్షల డ్రా చేసారు. హైదర్​గుట్టకు పనులు చేయకుండా రూ.5 లక్షలు దారి మళ్ళించారు. గుట్టపక్కతండాలోని 170 కూలీల నుంచి ప్రతి వారం టీఏ రామారావు ఒక్కొక్కరి నుంచి 300ల రూపాయల చొప్పున వసూల్​ చేసినట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.. ఘన్​పూర్​ పంచాయతీ పరిధిలో ఓ అధికారి సంతకాన్ని ఎంబీ బుక్​లో ఫోర్జరీ చేసి 15 లక్షల వరకు పక్కదారి పట్టించారని బయటపడింది. ఇలా ఏ జీపీలో చూసిన అవినీతి అక్రమాలు వెలుగులోకి రావడం రాజకీయ నేతల మధ్య వార్ కు దారితీసింది. ఎంపీపీ,సర్పంచ్ ల మధ్య వివాదంగా మారింది..అయితే దీనిపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు వైరల్ అవుతున్నాయి..అవినీతి జరిగిందని ఆడిట్ నివేదికలు అధికారుల ముందే బయటపెట్టారు. అయితే అక్రమాలకు పాల్పడిన వారితోపాటు దానికి సహకరించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.