NTV Telugu Site icon

Elections: రాజ్యసభ స్థానానికి నేడు నోటిఫికేషన్‌.. షెడ్యూల్‌ విడుదల

Mp Elections 2022

Mp Elections 2022

తెలంగాణ నుంచి ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు గురువారం నోటిఫికేషన్‌ వెలువడనున్నది. నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే నామినేషన్లు స్వీకరించనున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాటుచేశారు. ఈ నెల 30న ఎన్నిక జరుగనున్నది. రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్‌ తన పదవికి రాజీనామా చేయటంతో ఈ ఖాళీ ఏర్పడింది. ఈ స్థానంలో ఎన్నికయ్యే అభ్యర్థి పదవీ కాలం 2024, ఏప్రిల్‌ 2తో ముగుస్తుంది. బండా ప్రకాశ్‌ ఇటీవల ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఉప ఎన్నిక జరుగనున్న రాజ్యసభ స్థానాన్ని అధికార టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. శాసనసభలో వందకుపైగా ఎమ్మెల్యేలున్న టీఆర్‌ఎస్‌ ఒకటిరెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నది.

నామినేషన్లను నేటి నుంచి ఈ నెల 19 వరకు స్వీకరిస్తారు. 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 23 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. 30న ఉదయం 9గంటల నుంచి.. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ ముగిసిన అనంతరం… సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. బండా ప్రకాశ్‌ ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలో రాజ్యసభ సభ్యత్వానికి గత ఏడాది డిసెంబరులో రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఇదీ షెడ్యూల్‌..

నామినేషన్ల స్వీకరణ: 12-05-2022
నామినేషన్ల దాఖలకు తుదిగడువు: 19-05-2022
నామినేషన్ల పరీశీలన: 20-05-2022
నామినేషన్ల ఉపసంహరణ: 23-05-2022
పోలింగ్‌ : 30-05-2022 (ఉదయం 9.00 నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు)
ఓట్ల లెక్కింపు: పోలింగ్‌ ముగిసిన తరువాత సాయంత్రం 5.00 గంటల నుంచి ఎన్నిక ప్రక్రియ ముగింపు : జూన్‌ 1, 2022

Show comments