Site icon NTV Telugu

Munugode Bypoll: సమయం ఆసన్నమైంది.. రేపటి నుంచే మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్లు..

Munugode Bypoll

Munugode Bypoll

Munugode Bypoll: తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు కొంత కాలంగా ఎదురుచూస్తోన్న మునుగోడు ఉప ఎన్నికకు సమయం రానే వచ్చింది. రేపటి నుంచి మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్లు షురూ కానున్నాయి. అయితే..టీఆర్ఎస్‌ అభ్యర్థిని ఇంకా ప్రకటించక పోవడం చర్చకు దారితీస్తోంది. ఇవాళ మునుగోడుకు మంత్రులు, ఎమ్మెల్యేలు.. మునుగోడు నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా టీఆర్ఎస్‌ విభజించింది. ఒక్కో యూనిట్‌ బాద్యతలను ఒక్కో బృందానికి అప్పగించింది.

అక్టోబర్‌ 3న మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 7వ తేదీ మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు ఈసీ షెడ్యూల్‌లో వెల్లడించింది. నవంబర్‌ 3వ తేదీన ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్‌ జరగనున్నట్టు పేర్కొంది. బీహార్‌లోని రెండు స్థానాలకు, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశాలోని ఒక్కో అసెంబ్లీ స్థానంతో పాటు తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి షెడ్యూల్‌ ప్రకటించి ఈసీ. ఆ షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుండగా అక్టోబర్ 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 15వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉండగా, నామినేషన్ల ఉపసంహరణకు 17వ తేదీ గడువుగా పెట్టారు. ఇక, నవంబర్‌ 3వ తేదీన పోలింగ్‌ జరగనుండగా నవంబర్‌ 6వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. నవంబర్‌ 8వ తేదీతో ఉప ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగుస్తుందని ఈసీ పేర్కొంది.

Read also: Rahkeem Cornwall: టీ20ల్లో వరల్డ్ రికార్డ్.. 77 బంతుల్లోనే డబుల్ సెంచరీ

ఇప్పటికే మునుగోడుపై కేంద్రీకరించి పనిచేస్తున్నాయి ప్రధాన పార్టీలు… సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఈ ఎన్నికలు వస్తుండగా, ఆయన కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి కమలం పార్టీ తీర్థం పుచ్చుకొని ఈ సారి పువ్వు గుర్తుపై అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అయ్యారు. కేంద్ర మంత్రి అమిత్‌షాను పిలిచి భారీ బహిరంగసభ కూడా నిర్వహించారు. మరోవైపు, సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీగా గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును ఖరారు చేసి.. విస్తృతంగా ప్రచారంలో మునిగిపోయింది.. పల్లె పల్లెలో కార్యక్రమాలు, పాదయాత్రలు, అగ్రనేతల టూర్లు సాగుతున్నాయి.. మునుగోడు గడ్డ కాంగ్రెస్‌ అడ్డా అంటూ.. హస్తం పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రజానికంతో బహిరంగ సభ నిర్వహించింది. ఇక, ఆ రెండు పార్టీలు కాదు.. ఈ సారి విజయం మాదేనంటూ నమ్మకం వ్యక్తం చేస్తుంది టీఆర్ఎస్‌ పార్టీ. ఇప్పటి వరకు తమ అభ్యర్థిని ప్రకటించకపోయినా మంత్రి జగదీష్‌ రెడ్డి బాధ్యతలను తన బుజాలపై వేసుకుని విస్తృతంగా పర్యటిస్తున్నారు. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ను పిలిచి భారీ సభ నిర్వహించినా అభ్యర్థిని ప్రకటించలేదు. షెడ్యూల్‌ విడుదల కావడంతో.. ఏ క్షణంలోనైనా టీఆర్ఎస్‌ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో టాక్‌. మునుగోడు అభ్యర్థిని టీఆర్‌ఎస్‌ ఎవరిని ప్రకటించనుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

No charges for credit card use: క్రెడిట్ కార్డ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక, ఛార్జీలు లేవు..!

Exit mobile version