దక్షిణ కాశీగా పేరున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయం అభివృద్ధి నీటిమీద రాతలాగా మారింది. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఆలయం అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. భక్తులకు కనీస సదుపాయాలు అందడం లేదు. సౌకర్యాల కల్సనకు ఏటా 100 కోట్లు కేటాయిస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించినా అది అమలు కావడం లేదు. ఆలయ పీఠాధిపతులు వచ్చినప్పుడు హడావిడి చేస్తున్నారు. వేములవాడ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీకి చట్టబద్ధత లేదు. ఆలయానికి చెందిన 20 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్లు వేరే చోటకి తరలించడంపై భక్తులు మండిపడుతున్నారు. ఆదిలాబాద్ ఆలయాలకు 2 కోట్లు కేటాయించినట్టు తెలిసిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏటా ఇస్తానని ప్రకటించిన రూ.100 కోట్లు ఏమయ్యాయని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్ళలో ఆలయానికి 500 కోట్లు రావాలంటున్నారు. ఆలయ అధికారులు రూ.410 కోట్లతో భక్తుల సౌకర్యార్థం కోసం చేసిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో యాదాద్రి క్షేత్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే వేములవాడ రాజన్న ఆలయాన్ని సుందరంగా ఎప్పుడు తీర్చిదిద్దుతారా అని భక్తులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఆశలు ఇప్పుడిప్పుడే నెరవేరే అవకాశం కనిపించడం లేదు. రాజన్న చెరువు అభివృద్ధి, వసతిగదుల నిర్మాణం, సెంట్రల్ బస్టాండ్ల నిర్మాణం కోసం చేపట్టే భూసేకరణ పనులు ముందుకుసాగడం లేదంటున్నారు. 121 ఎకరాలు సేకరించాలనే లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఇప్పటివరకు సగం కూడా పూర్తిచేయలేకపోయారు. ఆలయ అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మిగిలిపోయాయని స్థానికులు పేర్కొంటున్నారు.