Site icon NTV Telugu

Farmers of Nizamabad: రైతులు వినూత్న నిరసన.. మా ఎంపీ తెచ్చిన పసుపుబోర్డు ఇదే అంటూ..

Nizamabad Pasupu Bord

Nizamabad Pasupu Bord

Farmers of Nizamabad: నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తే నిజామాబాద్ రైతులు గళం విప్పారు. ఈసారి వినూత్నంగా నిరసన తెలిపారు. పసుపు బోర్డుకు పంగనామం పెట్టారని నిజామాబాద్ రైతులు నిరసనకు దిగారు. పసుపు బోర్డు ఏర్పాటు ప్రతిపాదన లేదని వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంట్‌లో ప్రకటించడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పార్లమెంట్ వేదికగా మరోసారి మోసం బయటపడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా స్థానిక బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ నిరసన తెలిపారు. దీంతో నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా పసుపు బోర్డు ప్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఇది మా ఎంపి గారు తెచ్చిన పసుపు బోర్డు అంటూ ఖాళీ పసుపు హార్దింగ్ లు, ప్లెక్సీలు రైతులు కట్టారు. స్థానిక ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెస్తానని చెప్పి మోసం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ ,బోధన్,ఆర్మూర్ లలో వెలిసిన హోర్దింగ్ లు, ప్లెక్సీలు పసుపు బోర్డులు దర్శినమిస్తుండటంతో ఆశక్తిగా జనం చూస్తున్నారు.

గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి ఓట్లు పొందిన ధర్మపురి అరవింద్ తమను మోసం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. బాండ్ పేపర్ రాసినా ఇప్పటికీ పసుపు బోర్డు సాధించలేదని, బోర్డు పెట్టలేమని కేంద్రం చెబుతున్నా ఏమీ జరగడం లేదని రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పసుపుబోర్డు తీసుకురాకుంటే రాజీనామా చేస్తానని ఎన్నికల సమయంలో అరవింద్ చెప్పారని, నాలుగున్నరేళ్లు దాటినా బోర్డు సాధించలేకపోతే ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రాన్ని ఒప్పించలేని బీజేపీ నేతలు ప్రజలకు తిరిగే నైతిక హక్కు లేదన్నారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బీజేపీ అగ్రనేతలు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రామ్ మాధవ్ కూడా మోసపూరిత హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

గత కొంత కాలంగా పసుపు బోర్డు కోసం రైతులు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ధర్మపురి అరవింద్‌ను రైతులు చాలాసార్లు అడ్డుకున్నారు కూడా. ఆయన ఇంటి ముందు ఇసుక కుప్పలు వేసి నిరసన కూడా తెలిపారు. ఇంకెంత కాలం మోసం చేస్తారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి పసుపుబోర్డు కోసం ఆందోళనలు చేస్తామని, ధర్మపురి అరవింద్ ను తీవ్రంగా ప్రతిఘటిస్తామని రైతులు చెబుతున్నారు. మరి దీనిపై ధర్మపురి అరవిందే ఏవిధంగా స్పందించనున్నారో వేచి చూడాలి.

Exit mobile version