NTV Telugu Site icon

పోడు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం : మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి


గత కొంత కాంలంగా రాష్ట్రంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులపై అనేక సార్లు అటవీఅధికారులు దాడికి పాల్పడ్డారు. ఇదే సమయంలో తమకు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని రైతులు ఎన్నో సార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. తాజాగా శనివారం మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నేతృత్వంలో పోడు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, అధికారులు అఖిల పక్ష నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి ఇంద్ర కరణ్‌ రెడ్డి మాట్లాడారు. పోడు రైతుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఇప్పటికే పోడు రైతులతో, అఖిలపక్షం నాయకులతో చర్చలు జరుపుతున్నట్టు ఆయన తెలిపారు. పోడు రైతుల సమస్యలను పరిష్కరించేందుకే సీఎం కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దీనికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు.

ఇంకా మంత్రి మాట్లాడుతూ రైతులు సంయనంతో ఉండాలన్నారు. అటు రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు సహకరించాలన్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని మంత్రి అధికారులకు సూచించారు. గతంలో పోడు రైతులను విస్మరించారని అఖిలపక్షం నాయకులు మంత్రి వద్ద మొరపెట్టుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. అఖిల పక్షం నాయకులు అధికారులకు సహకరించాలని ప్రభుత్వం పోడు రైతుల సమస్యలను పరిష్కరించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు.