Site icon NTV Telugu

Nirmal Zilla Parishad: పదవి ఆమెది.. పెత్తనం ఆయనది..!!

Nirmal Zilla Parishad

Nirmal Zilla Parishad

నిర్మల్ జిల్లా పరిషత్ పాలన అదుపు తప్పుతోంది. నిర్మల్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా కొరిపెల్లి విజయలక్ష్మీ బాధ్యతలు చేపట్టారు. పేరుకు పదవి ఆమెదే అయినా మొత్తం యంత్రాంగాన్ని నడిపించేది ఆమె భర్త రాంకిషన్‌రెడ్డి. జెడ్పీ సీఈవోల నుంచి మండలాల్లో పనిచేసే ఎంపీడీవోలు సైతం తన ఆదేశాల మేరకు పనిచేయాలని రాంకిషన్‌రెడ్డి హుకుం జారీ చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. తనకు తెలియకుండా ఏదైనా ఫైల్ కదిలితే అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించినట్లు జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో రాంకిషన్‌రెడ్డి జెడ్పీటీసీ కాకపోయినా తెగ హడావిడి చేశారని అధికారులే స్వయంగా ఆరోపించారు. ఛైర్‌పర్సన్ స్థానంలో ఓ ఎమ్మెల్సీకి రాంకిషన్‌రెడ్డే స్వయంగా సన్మానం చేశారు. జెడ్పీ ఛైర్‌పర్సన్ విజయలక్ష్మీకి కేటాయించిన ఇద్దరు గన్‌మెన్‌లను రాంకిషన్‌రెడ్డి వినియోగించుకుంటున్నారు. జెడ్పీ ఛైర్‌పర్సన్‌ను మించేలా అధికారులను వెంటపెట్టుకుని పర్యటనలు చేస్తుండటం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఇటీవల జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల వ్యవహారాన్ని కలెక్టర్ సీరియస్‌గా తీసుకున్నారు. కొన్ని ఆస్పత్రులను సీజ్ చేయడంతో విజయలక్ష్మీ భర్త రంగంలోకి దిగారు. ఐఎంఏ అధ్యక్షుడు, కలెక్టర్ మధ్య రాజీ కుదిర్చినట్లు జిల్లాలో చర్చ నడుస్తోంది. జెడ్పీ పాలన వ్యవహారాల్లో చక్రం తిప్పడమే కాకుండా గన్‌మెన్‌లను దుర్వినియోగం చేస్తున్నా ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించడంపై ప్రజలు మండిపడుతున్నారు.

Exit mobile version