Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!

  • నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్
  • 25 చోరీ కేసుల్లో కీలక ఆధారాలు
  • 12 కిలోల వెండి, కారు స్వాధీనం
  • సీసీటీవీ, టెక్నాలజీతో ముఠా పట్టివేత
Temple Theft

Temple Theft

Temple Theft : నిర్మల్ జిల్లాలో వరుసగా దేవాలయాలు, ఇళ్లు, దుకాణాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జిల్లా పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. దొంగతనాల నివారణకు జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల ఏర్పాటు చేసిన ‘టైగర్స్ టాస్క్ ఫోర్స్’ బృందం ప్రత్యేక దర్యాప్తు చేపట్టి ఈ కేసును ఛేదించింది. భైంసా ఏఎస్పీ, నిర్మల్ డీఎస్పీల పర్యవేక్షణలో సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

25 చోరీల్లో ప్రమేయం, 16 కేసుల సొత్తు రికవరీ

పోలీసుల విచారణలో ఈ ముఠాకు నిర్మల్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం 25 చోరీ కేసులతో సంబంధం ఉన్నట్లు తేలింది. వీటిలో ఇప్పటికే 16 కేసులకు సంబంధించిన చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకోగా, మిగిలిన కేసులపై దర్యాప్తు వేగవంతం చేశారు. అరెస్టయిన నిందితులను నిర్మల్ బాగుల్వాడకు చెందిన మారేపెద్ది రాజశేఖర్, గడ్చంద రాజేశ్వర్, నిర్మల్ రూరల్ మండలానికి చెందిన కల్గద్దవార్ శ్రీకాంత్ , హైదరాబాద్‌కు చెందిన సారా సాయికిరణ్‌గా పోలీసులు గుర్తించారు.

భారీగా స్వాధీనం చేసుకున్న సొత్తు

నిందితుల వద్ద నుంచి కోట్లాది రూపాయల విలువైన వస్తువులను పోలీసులు రికవరీ చేశారు. ఇందులో నిస్సాన్ మాగ్నైట్ కారు, 12 కిలోల వెండి ఆభరణాలు, వెండిని కరగదీసే మెల్టింగ్ మెషిన్, గ్యాస్ పైప్ మెషిన్ , రూ. 67,000 నగదు ఉన్నాయి. ఈ ముఠా నిర్మల్ పరిధిలోని అయ్యప్ప ఆలయం, మహాలక్ష్మి ఆలయం, శాస్త్రినగర్ ఆంజనేయస్వామి ఆలయం, మామడ వెంకటేశ్వరస్వామి ఆలయం , పలు ఇళ్లలో చోరీలకు పాల్పడి అమ్మవారి కిరీటాలు, వెండి పాదుకలు, వెండి బిస్కెట్లను దోచుకెళ్లినట్లు తేలింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, గన్నవరం పోలీస్ స్టేషన్ల పరిధిలోని చోరీల్లోనూ ఈ ముఠా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించి అక్కడి సొత్తును కూడా స్వాధీనం చేసుకున్నారు.

పోలీస్ బృందానికి ఎస్పీ అభినందనలు

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, వివిధ పోలీస్ స్టేషన్ల కేసులను అనుసంధానించి ఈ అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన టాస్క్ ఫోర్స్ , స్థానిక పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో దొంగతనాల అదుపునకు టాస్క్ ఫోర్స్ నిఘా నిరంతరం కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. ప్రజలు తమ ఇళ్లు, దుకాణాలు , ఆలయాల వద్ద తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.