Niranjan Reddy : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. ప్రెస్ మీట్ ముగింపు సమయంలో ఆయన మాట్లాడుతూ హరీష్ రావు పార్టీ కోసం చేసిన కృషిని గుర్తుచేశారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, “బ్రహ్మం గారికి సిద్ధయ్య లాంటి వాడు హరీష్ రావు. పార్టీ పెట్టే సమయంలో జెండాకు రంగు కోసం బేగం బజారుకు వెళ్లి తెచ్చిన వాడే హరీష్ రావు. ఎన్నికల సమయంలో పత్రికలు వేసుకొని పడుకున్న వారిలో ఆయన కూడా ఒకరు. అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకుంటాడా?” అని ప్రశ్నించారు.
హరీష్ రావు పనితీరును గతంలో ప్రశంసించిన వారే ఇప్పుడు విమర్శించడం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు. “ప్రజాభిమానాన్ని సంపాదించిన నాయకుడు హరీష్ రావు. బీఆర్‌ఎస్‌కు సంపదలాంటి వాడు. ఉపఎన్నిక ఏదైనా గెలిపించే సత్తా ఉన్న ట్రబుల్ షూటర్. ఏ శాఖ ఇచ్చినా ఆ శాఖకు వన్నె తెచ్చిన వాడు” అని అన్నారు. కవిత వ్యాఖ్యలపై మాట్లాడుతూ, “కవితకు కష్టం వచ్చినప్పుడు మేమంతా అండగా నిలిచాం. జైలులో ఉన్నప్పుడు అనేక సార్లు హరీష్ రావు బాగోగులు తెలుసుకున్నారు. ఇప్పుడు లాభం కోసం ఆయనను టార్గెట్ చేయడం అన్యాయం. కవిత మా సొంత కూతురులాంటిది. కుటుంబ గొడవలు అందరికీ ఉంటాయి” అని పేర్కొన్నారు. అలాగే, “కేసీఆర్ లెజెండ్. ఆయన్ని ఎవరూ తప్పుదారి పట్టించలేరు. రామన్న మంచివాడు అని చెప్పడంలో తప్పులేదు. అదే సమయంలో హరీష్ అన్న కూడా మంచోడని కవిత ఎన్నిసార్లో చెప్పింది” అని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు.
