NIMS Hyderabad : నిమ్స్‌లో వైద్య రంగానికి మైలురాయి.. 2 గంటల్లోనే బ్రెయిన్ సర్జరీలు

  • 5 గంటల సంక్లిష్ట బ్రెయిన్ సర్జరీ.. ఇక కేవలం 1-2 గంటల్లోనే..
  • అవస్థలు లేని అనస్థీషియా విధానం.. ఇక రోగులు మెలకువగా ఉండాల్సిన పనిలేదు
  • ఎలాంటి పరికరాలు అమర్చకుండానే వణుకు వ్యాధికి అత్యాధునిక చికిత్స
  • ప్రైవేట్‌లో రూ. 5 లక్షల ఖర్చు.. నిమ్స్‌లో సీఎంఆర్‌ఎఫ్ (CMRF) ద్వారా ఉచితం
Nims

Nims

NIMS Hyderabad : హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) న్యూరోసర్జరీ విభాగం ఫంక్షనల్ న్యూరోసర్జరీ రంగంలో ఒక విప్లవాత్మక చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. న్యూరోసర్జరీ విభాగాధిపతి ప్రొఫెసర్ డా. వై. వంశీ కృష్ణ నాయకత్వంలో, గతంలో సుదీర్ఘ సమయం పట్టే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (DBS) శస్త్రచికిత్సల వ్యవధిని గణనీయంగా తగ్గించారు. 5 నుంచి 6 గంటల సమయం తీసుకునే ఈ సర్జరీలను ఇప్పుడు కేవలం 1 నుండి 2 గంటల్లోనే అత్యంత ఖచ్చితత్వంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

5 గంటల సర్జరీ 1-2 గంటల్లోనే.. రోగులకు తీరిన ఆందోళన

సాధారణంగా పార్కిన్సన్స్, ఎసెన్షియల్ ట్రెమర్, డిస్టోనియా వంటి వణుకు వ్యాధుల (Movement Disorders) శస్త్రచికిత్సల సమయంలో రోగులను పలు గంటల పాటు మెలకువగానే (Awake Craniotomy) ఉంచాల్సి వచ్చేది. దీనివల్ల బాధితులు తీవ్ర శారీరక అసౌకర్యానికి, మానసిక ఆందోళన , అలసటకు గురయ్యేవారు. అయితే యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన నిమ్స్ వైద్య బృందం, అత్యాధునిక ఇమేజింగ్ , పక్కా సర్జికల్ ప్లానింగ్‌ను ఉపయోగించి మార్పులు తెచ్చింది. ఇప్పుడు ఎంపిక చేసిన రోగులకు జనరల్ అనస్థీషియా (మత్తు) ఇచ్చి కేవలం 1–2 గంటల్లోనే ఈ సర్జరీని పూర్తి చేస్తున్నారు. గత రెండున్నర సంవత్సరాలలో 200కు పైగా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి, ఫంక్షనల్ న్యూరోసర్జరీలో నిమ్స్ దేశంలోనే ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థగా నిలిచింది.

పరికరాలు లేకుండా వణుకు వ్యాధికి క్వాలిటీ చికిత్స

మందులతో అదుపులోకి రాని తీవ్రమైన వణుకు (Tremor) సమస్యతో బాధపడుతున్న వారి కోసం నిమ్స్ మరో కొత్త విప్లవాత్మక విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే MRI గైడెడ్ రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఇందులో ఆధునిక MRI సీక్వెన్సుల సహాయంతో బ్రెయిన్ లోపల ఉండే డెంటాటో–రూబ్రో–థాలామిక్ (DRT) మార్గాన్ని కచ్చితంగా గుర్తించి చికిత్స అందిస్తారు. శరీరంలో ఎటువంటి శాశ్వత పరికరాలను అమర్చాల్సిన అవసరం లేకుండానే ఈ రేడియోఫ్రీక్వెన్సీ చికిత్స విజయవంతంగా పనిచేస్తుంది. దీనితో పాటు న్యూరోజెనిక్ బ్లాడర్ సమస్యతో బాధపడేవారికి సాక్రల్ న్యూరోమాడ్యులేషన్ సేవలను కూడా నిమ్స్ ప్రారంభించింది.

ప్రైవేట్‌లో రూ. 5 లక్షలు.. నిమ్స్‌లో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా పూర్తి ఉచితం

ఈ రకమైన అత్యాధునిక వైద్యానికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో దాదాపు రూ. 5 లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ నిమ్స్ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా అర్హులైన పేద రోగులకు ఈ సేవలన్నీ పూర్తి ఉచితంగా అందుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రపంచ స్థాయి సాంకేతికతను సామాన్యులకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ డా. రాహుల్ దేవరాజ్ తెలిపారు. అతి తక్కువ సమయంలో పూర్తికావడం వల్ల రోగులు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా వేగంగా కోలుకోవడానికి ఈ విధానం ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు.