ఇవాళ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాల కేసులో ఎన్ఐఏ ఎదుట విచారణకు 10 మంది యువకులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. అయితే.. పీఎఫ్ఐ సంస్థ కార్యకలాపాల ముసుగులో ఉగ్రవాద శిక్షణ ఇస్తూ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తోందనే అభియోగాలతో నిన్న (ఆదివారం) ఎన్ఐఏ విస్తృత దాడులు నిర్వహించింది. ఈనేపథ్యంలో.. నిజామాబాద్ లో 23, హైదరాబాద్ లో 4, జగిత్యాలలో 7, నిర్మల్ లో 2, ఆదిలాబాద్, కరీంనగర్ లలో ఒక్కో ప్రాంతం, ఏపీలోని 2 చోట్ల సోదాలు చేసింది.
ఈసందర్భంగా.. నిజామాబాద్ లో ఒకరిని అదుపులోకి తీసుకొని.. ఎన్ఐఏ కార్యాలయానికి రావాలని ఇంకొందరికి నోటీసులిచ్చారు. ఈవిధంగా.. నోటీసులు అందుకున్న వారిలో 10 మంది నేడు ఎన్ఐఏ కార్యాలయ ఉన్నతాధికారుల ఎదుట హాజరయ్యారు. నిన్ని రోజైన ఆదివారం సోదాల సందర్భంగా అరెస్టు చేసిన సమీర్ (బోధన్).. ఫిరోజ్ (ఆదిలాబాద్).. మహ్మద్ ఇర్ఫాన్ అహ్మద్ (జగిత్యాల).. ఇలియాస్ ( నెల్లూరులోని బుజ్జి రెడ్డి పాళ్యం)లను ఎన్ఐఏ కోర్టులో ఇవాళ ప్రవేశపెట్టారు. అయితే.. పీఎఫ్ఐ కార్యకలాపాలు నిర్వహించిన కరాటే ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ తో పాటు 28 మందిపై నిజామాబాద్ పోలీసులు గతంలో నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా.. నిజామాబాద్ బేస్ క్యాంప్ గా కరాటే శిక్షణ.. లీగల్ అవేర్ నెస్ కార్యక్రమాలను పీఎఫ్ఐ నిర్వహించినట్లు దర్యాప్తులో గుర్తించారు.
