NTV Telugu Site icon

Panjagutta Nisha Case: నిషా కేసులో కొత్త ట్విస్ట్.. ఇరికించడానికే ఈ ప్లాన్

Nisha Case Twist

Nisha Case Twist

New Twist in Panjagutta Nisha Case: విజయసింహా అనే ఒక ఎమ్మెల్యే అనుచరుడు తనపై కత్తితో దాడి చేశాడని నిషా అనే మహిళ పెట్టిన కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇదంతా ఆ మహిళ ఆడిన డ్రామాగా పోలీసులు నిగ్గు తేల్చారు. విజయసింహాపై కోపంతోనే ఆమె ఈ డ్రామాకు తెరలేపినట్టు తేలింది. ఆమె గొంతుపై ఎలాంటి గాయాలు లేవని కూడా వెల్లడైంది. వైద్యులు ఈ విషయం చెప్పాక అనుమానం వచ్చిన పోలీసులు.. తమదైన శైలిలో విచారణ చేయగా, అసలు గుట్టు బట్టబయలైంది. అసలేం జరిగిందంటే..

కొన్ని నెలల క్రితం విజయసింహాకు నిషాతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. విజయసింహా అప్పుడప్పుడు ఆమె ఇంటికి వెళ్లి రావడం, ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగడం చేశారు. అయితే.. ఈమధ్య అతడు నిషాను దూరం పెడుతూ వచ్చాడు. ఎన్నిసార్లు పిలిచినా ఆమె వద్దకు వెళ్లలేదు. దీంతో.. అతనిపై ఆమె కోపం పెంచుకుంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించి, ఈ దాడి నాటకానికి తెరతీసింది. అర్థరాత్రి తన ఇంట్లోకి దూసుకొచ్చి మరీ, విజయసింహా తన గొంతు కోశాడని అబద్ధం చెప్పింది. అంతేకాదు, లైంగికంగా వేధిస్తున్నాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి పంపించి, చికిత్స అందించారు.

అయితే.. నిషా చెప్తున్న మాటల్లో వాస్తవం లేదని, ఆ సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానని విజయసింహా ఆధారాలతో సహా మీడియా ముందుకొచ్చాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంతలో వైద్యులు నిషాకు ఎలాంటి గాయాలు కాలేదని, గొంతుపై కత్తి గాట్లు లేవని చెప్పారు. అప్పుడు పోలీసులు నిలదీయగా.. అసలు విషయం చెప్పింది నిషా. తనని దూరం పెడుతున్నందుకే, కోపంతో ఈ పనికి పాల్పడ్డానని చెప్పింది. అతడ్ని ఇరికించాలనే డ్రామా ఆడినట్టు ఒప్పుకుంది. దాంతో.. పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి, ఇంటికి పంపించారు. మరోవైపు.. విజయసింహా ఇంతవరకూ ఫిర్యాదు చేయకపోవడంతో, పోలీసులు ఆ మహిళపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని తెలిసింది.