Site icon NTV Telugu

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు కొత్త రహదారి

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో కొత్త దారి ఏర్పాటు కానుంది. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వచ్చే నెలలో జరగనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ మార్గాన్ని ఔటర్‌ రింగు రోడ్డుకు అనుసంధానం చేస్తున్నారు. ఫిబ్రవరి 5న రామానుజుల విగ్రహావిష్కరణ కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడకు రానున్నారు. ఈ రోడ్డు మార్గంలోనే ఆయన ప్రయాణించేందుకు అధికారులు ప్రత్యామ్నాయంగా ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. శంషాబాద్‌ నుంచి బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఓ దారి, శ్రీశైలం రహదారి నుంచి తుక్కుగూడ సమీపంలోంచి మరో దారి ఇది వరకే ఉండగా.. ప్రస్తుతం గొల్లపల్లి మీదుగా పెద్దగోల్కొండలోని ఔటర్‌ రోటరీ జంక్షన్‌ను అనుసంధానం చేస్తూ కొత్తగా రహదారిని విస్తరిస్తున్నారు.

విమానాశ్రయం రెండో దశ విస్తరణలో భాగంగా ఎయిర్‌పోర్టు ఆవరణలో కార్గో వాహనాల కోసం నాలుగు వరసల రహదారి ఏర్పాటు చేశారు. ఈ రహదారి ముఖ్యంగా కార్గో టెర్మినల్‌ నుంచి సరుకుల వాహనాల రాకపోకల కోసం ఏర్పాటు చేశారు. ఇది వరకు ఉన్న ఎయిర్‌పోర్టు మార్గాలో విమాన ప్రయాణికులు రాకపోకలు సాగిస్తే.. కొత్తగా ఏర్పాటు చేసిన మార్గంలో కార్గో వాహనాలకు అనుమతి ఇవ్వనున్నారు. కార్గో వాహనాలు ఔటర్‌ మీదుగా పెద్దగోల్కొండ రోటరీ జంక్షన్‌ నుంచి ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లేలా మార్గం ఏర్పాటు చేశారు.

Exit mobile version