NTV Telugu Site icon

New Director to NIMS: ‘‘నిమ్స్‌ డైరెక్టర్’’పై విమర్శలకు చెక్. సకాలంలో స్పందించిన ప్రభుత్వం. కొత్త డైరెక్టర్‌ కోసం సెర్చ్‌ కమిటీ ఏర్పాటు

New Director To Nims

New Director To Nims

New Director to NIMS: నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌)కి కొత్త డైరెక్టర్‌ రానున్నారు. ప్రస్తుత డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌.. గుండె పోటుతో నాలుగు రోజుల కిందట హైదర్‌గూడలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకి ఆ ఆస్పత్రిలోనే సర్జరీ చేయనుండటం, దీనివల్ల దీర్ఘకాలం ట్రీట్మెంట్‌ పొందాల్సి ఉండటంతో నిమ్స్‌కి కొత్త డైరెక్టర్‌ని నియమించకతప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం.. ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌రావు నేతృత్వంలో సెర్చ్‌ కమిటీని ఏర్పాటుచేసింది.

నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌ భార్య, పిల్లలు విదేశాల్లో నివసిస్తున్నారు. దీంతో ఆయన ఒక్కరే ఇక్కడ ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో స్నేహితులే మనోహర్‌ని అతని ఇంటికి దగ్గరలో ఉన్న ఆ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చేర్పించారు. ఆయన బంధువులు సైతం ఆ ఆస్పత్రిలో పనిచేస్తుండటంతో మిత్రులు అక్కడికి తీసుకెళ్లారు. అయితే ఇది రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిమ్స్‌కి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి పేరుంది. పేదలకు, మధ్యతరగతి ప్రజలకు సబ్సిడీ రేట్లకు (తక్కువ ఖర్చుతో) వైద్యం అందిస్తున్న అత్యున్నత సంస్థగా నిలిచింది.

Hyderabad Hosting Restaurant Conclave: రెస్టారెంట్ల నేషనల్‌ అసోసియేషన్‌ సదస్సుకు ఆతిథ్యమిస్తున్న హైదరాబాద్‌

అయితే.. అంతటి ఘనత వహించిన గవర్నమెంట్‌ హాస్పిటల్‌ హెడ్‌.. గుండె సంబంధ అనారోగ్యంతో ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరటం వివాదాస్పదంగా మారింది. దీనిపై ప్రభుత్వ వైద్య వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. డాక్టర్‌ మనోహర్‌.. నిమ్స్‌ డైరెక్టర్‌గా 2015 ఆగస్టు నుంచి (ఏడేళ్లకు పైగా) కొనసాగుతున్నారు. 1985 నుంచి ఇప్పటివరకు ఇంత ఎక్కువ కాలం ఈ పదవిలో ఎవరూ లేరు. మనోహర్‌ స్వయంగా ముందుండి నడుపుతున్న సంస్థలోనే తాను వైద్యం తీసుకోకపోవటంపై ప్రజల నుంచి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఆయన నిమ్స్‌కి చెడ్డ పేరు తెచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మనోహర్‌ని తప్పుపడుతూ మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. ఆయన ఆ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో తన వైద్యానికయ్యే ఖర్చును రీయింబర్స్‌ కోరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. అందరిలాగే మనోహర్‌కి ఈ రీయింబర్స్‌మెంట్‌ అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్‌ సంస్థకు ధారాదత్తం చేస్తారా అంటూ మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలంటూ చాలా మంది ఆసక్తితో ఉన్నారు. ఆయన్ని నిమ్స్‌ డైరెక్టర్‌ పదవి నుంచి తప్పిస్తారనే ఊహాగానాలూ వినిపించాయి. ఈ నేపథ్యంలో సర్కారు సకాలంలో సరైన రీతిలో స్పందించింది. మనోహర్‌ తీసుకున్న నిర్ణయం తప్పా ఒప్పా అనేదాని జోలికి పోకుండా ఆరోగ్య కారణాల రీత్యా ఆయన్ని పక్కన పెడుతున్నట్లు పరోక్షంగా వెల్లడించింది. దీంతో ఈ ఇష్యూకి దాదాపుగా ఫుల్‌స్టాప్‌ పెట్టేసింది.