Montha Effect : తెలంగాణలో మొంథా తుఫాన్ ప్రభావంతో అనేక జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నిన్న రాత్రి నుంచే ఖమ్మం నుంచి భద్రాద్రి కొత్తగూడెంకు వెళ్లే రహదారులు వరద ముంపుకు గురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని ప్రమాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి.
కొనిజర్ల మండలం సాలే బంజర వాగు వద్ద బుధవారం ఉదయం ప్రమాదం తప్పింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా, బైక్‌పై వెళ్లిన ఇద్దరు వ్యక్తులు వాగు దాటే ప్రయత్నం చేశారు. వాగు మధ్యలోకి వెళ్లగానే వారి బైక్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. వారిద్దరూ నీటిలో కొట్టుకుపోతుండగా అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా తక్షణమే అక్కడకు చేరుకుని తాళ్ల సహాయంతో ఆ ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీశారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు.
అదే రహదారి పరిధిలోని ఏనుకూరు మండలంలోని నిమ్మ వాగు వద్ద కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. వరద ముంపు ఉన్నప్పటికీ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ డీసీఎం వాహనం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఆ వాహనంలో ఉన్న వ్యక్తుల్లో ఒకరు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కొనిజర్ల, ఏనుకూరు, కట్టలేరు ప్రాంతాల్లో వాగులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అధికారులు ప్రజలను అత్యవసరమైతే తప్ప వాగులు, కాజ్‌వేలు దాటవద్దని హెచ్చరిస్తున్నారు. తుపాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతుండగా, విద్యుత్ అంతరాయాలు, చెట్లు కూలిపోవడం వంటి సమస్యలు కూడా కొన్ని చోట్ల నమోదవుతున్నాయి. జిల్లా యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
Jaish-e-Mohammed: హిందూ మహిళలను ఎదుర్కొనేందుకు “మహిళ ఉగ్రవాద విభాగం”.. జైషే మహ్మద్ బ్రెయిన్ వాష్..
