Site icon NTV Telugu

Nampally Fire Accident : నాంపల్లిలో అగ్ని ప్రమాదం.. ఫర్నీచర్‌ షాపులో చెలరేగిన మంటలు..

Fire Accident

Fire Accident

హైదరాబాద్ నగరంలోని రద్దీ ప్రాంతమైన నాంపల్లిలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఫర్నిచర్ షోరూమ్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే భవనం మొత్తానికి వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నాంపల్లి ప్రధాన రహదారిపై ఉన్న ఒక నాలుగు అంతస్తుల కమర్షియల్ భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. భవనం కింద ఉన్న సెల్లార్‌లోని హోల్‌సేల్ ఫర్నిచర్ షాపులో మొదట మంటలు ప్రారంభమయ్యాయి. లోపల ఫర్నిచర్ సామాగ్రి అధికంగా ఉండటంతో మంటలు వేగంగా పై అంతస్తుల వరకు వ్యాపించాయి. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో జనం పరుగులు తీశారు.

ప్రమాద సమయంలో భవనంలో ఇద్దరు నుండి నలుగురు పిల్లలు చిక్కుకున్నట్లు వార్తలు రావడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అయితే, అగ్నిమాపక సిబ్బంది రాకముందే స్థానిక యువకులు సాహసించి భవనంలోకి వెళ్లి పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. భవనంలోని మిగిలిన కుటుంబాలను , పక్కనే ఉన్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని నివాసితులను అధికారులు వెంటనే ఖాళీ చేయించారు.

Vivo X100 Pro 5G: వివో X100 Pro పై రూ.38,000 డిస్కౌంట్.. ట్రిపుల్ 50MP కెమెరాలు.. AMOLED డిస్‌ప్లే, 5400mAh బ్యాటరీ

మంటలను అదుపు చేసేందుకు నాలుగు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే, భవనం ఇరుకైన సందులో ఉండటం , చుట్టూ సెట్‌బ్యాక్స్ (ఖాళీ స్థలం) లేకపోవడంతో అగ్నిమాపక యంత్రాలు లోపలికి వెళ్లడానికి వీలు పడలేదు. దీంతో సిబ్బంది పక్కనే ఉన్న భవనాల గోడలపైకి ఎక్కి ప్రాణాలకు తెగించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ప్రధాన రహదారిపైనే ఈ ప్రమాదం జరగడంతో నాంపల్లి నుంచి అబిడ్స్ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పరిస్థితిని గమనించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే వాహనాల రాకపోకలను ఇతర మార్గాల్లోకి మళ్లించారు.

గంటల తరబడి శ్రమించిన అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను ప్రాథమికంగా అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఆస్తి నష్టం భారీగానే ఉన్నప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నగరంలోని ఇరుకైన ప్రాంతాల్లో అగ్నిమాపక నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

AP Handicrafts Global Recognition: ఏపీ హస్తకళలకు అంతర్జాతీయ వేదికపై మరో గుర్తింపు

Exit mobile version