Nallu Indrasena Reddy Comments On Early elections:తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ తోె పాటు కాంగ్రెస్ పార్టీలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. ఇదే విధంగా బీజేపీ కూడా ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తోంది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, మనుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మరికొంత మంది నేతలు కూడా రాజగోపాల్ రెడ్డి బాటలోనే బీజేపీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న దాసోజు శ్రవణ్ కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు. మరో వైపు టీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నేతగా ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
ఇక బీజేపీ, టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతోంది. బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలు వెళ్లే ఆలోచనలో ఉన్నారని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సీఎం కేసీఆర్ ను గద్దె దింపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థులు మిగలరని ఆయన అన్నారు. మునుగోడు ఎన్నికలను ఫేస్ చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా లేరని మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ తరుపున టికెట్లు అడిగే వారు కూడా ఉందరనే భయం ఆ పార్టీకి పట్టుకుందని ఇంద్రసేనా రెడ్డి అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఈ మోసపూరిత, అబద్దాల టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ వర్థంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సుష్మా స్వరాజ్ చిత్రపటానికి ఇంద్ర సేనా రెడ్డి, తుల ఉమ, పార్టీ శ్రేణులు నివాళులు అర్పించారు. ఉద్యమ ఆంకాక్షలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. శ్మశాన వాటికలకు ఎక్కడైనా జీఎస్టీ వేశారా.. వేస్తామని చెప్పారా.. అని టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు. టీఆర్ఎస్ సర్కారు అబద్ధాలను ప్రచారం చేస్తోందని విమర్శలు గుప్పించారు.
