బుద్ధ జయంత్యుత్సవాలకు నల్లగొండ జిల్లా నందికొండలోని బుద్ధవనం ముస్తాబైంది. 2,566 వ బుద్ధ జయంతి సందర్భంగా బుద్ధవనం, ధ్యానవనం, జాతక వనం, మహాస్థూపం, ఎంట్రన్స్ ప్లాజాలో 2,566 రంగురంగుల విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. బుద్ధవనం ప్రారంభం తర్వాత మొదటిసారిగా నిర్వహిస్తున్న బుద్ధ జయంతిని వీక్షకులకు మధురానుభూతులు పంచేలా నిర్వహిస్తున్నామని బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు.
ఈ సందర్భంగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉండ్రు రాజశేఖర్ ‘సమకాలీన సమాజానికి బౌద్ధ’ అనే అంశంపై ప్రసంగిస్తారని తెలిపారు. బౌద్ధ నిపుణులు ఈమని శివనాగిరెడ్డి, ఆచార్య సంతోష్‌రావత్ పాల్గొంటారని వెల్లడించారు.
నల్లగొండ జిల్లా నాగార్జున్‌సాగర్‌లోని బుద్ధవనాన్ని మంత్రి కేటీఆర్ శనివారం (14)న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. వైభవంగా జరగాల్సిన కార్యక్రమం మంత్రుల మధ్య సమన్వయ లోపంతో సాదాసీదాగా జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం 14న (శనివారం) ప్రారంభించాలని నిర్ణయించినా శుక్రవారం బాగా పొద్దుపోయిన తర్వాత వాయిదా వేయాలని నిర్ణయించారు.
బుద్ధవనానికి అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించేందుకు వివిధ దేశాలకు చెందిన బౌద్ధ బిక్షువులను ఆహ్వానించి వారి సమక్షంలో ప్రారంభించాలని అనుకున్నట్లు తెలిసింది. అయితే ప్రారంభ తేదీ ముందే ఖరారు కావడంతో అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేశారు. పూలు, విద్యుత్తు దీపాలతో అలంకరణ, శిలాఫలకం ఏర్పా టు, వివిధ రాష్ట్రాల నుంచి బౌద్ధ భిక్షువులను రప్పించేందుకు విమాన టికెట్లు తదితరాల కోసం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చుచేశాయి.
ఇందుకు రూ.10 లక్షల దాకా ఖర్చయిందని.. కార్యక్రమం వాయిదా పడితే ఈ డబ్బంతా వృధా అవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు అంతకుముందు.. 14న ప్రారంభోత్స కార్యక్రమంపై తనకు సమాచారం లేకపోవడంతో జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి.. అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమం వాయిదా పడటంతో ఈ కార్యక్రమాన్ని ఆయన.. మంత్రి కేటీఆర్ పరిశీలన వరకే పరిమితం చేశారు.
ఇటు.. వెచ్చించిన నిధులు వృధా అవుతాయని పర్యాటక శాఖ అధికారులు చెప్పడంతో ఆ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రంగంలోకి దిగారు. షెడ్యూల్ ప్రకారం ప్రారంభోత్సవ కార్యక్రమం దిశగా జరిగిన ఏర్పాట్లు.. 13న ఉదయం నుంచి ఆ రోజు రాత్రి పొద్దుపోయే దాకా జరిగిన గందరగోళ పరిస్థితులు.. అధికారుల ఇబ్బందులను మంత్రి జగదీశ్‌రెడ్డికి శ్రీనివా్‌సగౌడ్ వివరించారు. దీంతో సమస్య పరిష్కారమవడంతో శనివారం ఉదయాన్నే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఖరారు చేశారు. బౌద్ధ భిక్షువులతో పూజలు చేయించి సాదాసీదాగా బుద్ధవవాన్ని ప్రారంభించారు.