Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!

  • మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్
  • 40 చోరీ కేసులు ఛేదింపు
  • రూ.53 లక్షల సొత్తు స్వాధీనం
  • ఇద్దరు నిందితులు పరారీ
Arrest

Arrest

Criminal Gang : నల్లగొండ జిల్లాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భుష్మి శ్రీకాంత్ గ్యాంగ్‌కు చెందిన ఆరుగురు నిందితులను పోలీసులు శ్రమించి అరెస్ట్ చేశారు. మొత్తం ఎనిమిది మంది సభ్యులతో ఒక పెద్ద నేర సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేసిన భూష్మి శ్రీకాంత్, రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలతో పోలీసులకు పెద్ద సవాలుగా మారాడు. ఈ గ్యాంగ్‌ను పట్టుకోవడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటివరకు వారు పాల్పడిన దాదాపు 40 భారీ చోరీ కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. అయితే ఈ ముఠాలోని ప్రధాన నిందితుడితో పాటు మరో నేరస్థుడు ప్రస్తుతం పరారీలో ఉండగా, వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల నుంచి భారీ ఎత్తున దొంగతనాల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన వాటిలో సుమారు రూ. 53 లక్షల విలువైన 260 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 కిలోల వెండి, రూ. 1,50,000 నగదు ఉన్నాయి. వీటితో పాటు నేరాలకు ఉపయోగించిన 5 మోటార్ సైకిళ్లు (బైక్‌లు), 7 మొబైల్ ఫోన్లు, అలాగే దొంగిలించిన రెండు టీవీలు, రెండు సౌండ్ బాక్సులను పోలీసులు సీజ్ చేశారు. ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌తో రెండు రాష్ట్రాల వ్యాప్తంగా పలువురు ఊపిరి పీల్చుకున్నారు.