NTV Telugu Site icon

Nalgonda Roads: ఛిద్రమయిన రోడ్లు.. జనం ఇబ్బందులు

నల్గొండ జిల్లాలో అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లు మరమ్మతులు చేయకపోవడంతో మరింత అధ్వాన్నంగా తయారయ్యాయి.నిధులు సకాలంలో మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్లు రోడ్ల మరమ్మత్తులు చేసేందుకు ముందుకు రావడం లేదు. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు గడువు లోపు పనులు చేయకుండానే చేతులెత్తేస్తున్నారు. దీంతో జిల్లాలో వంద కోట్ల విలువైన పనులకు బ్రేక్ పడ్డాయి.

నల్గొండ జిల్లాలో 1835 కిలోమీటర్లు పనులు ఉన్నాయి. అందులో రాష్ట్ర రహదారులు 195 కిలోమీటర్లు కాగా మిగిలినవి జిల్లా రహదారులు 1636 కిలోమీటర్లు.ఈ ఏడాది వర్షాల కారణంగా 260 కిలోమీటర్లు రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు.డ్యామేజి అయిన రోడ్ల కు మరమ్మతులు చేయకపోవడం తో రోడ్లు అద్వాన్నంగా తయారయ్యాయి. నల్గొండ మునుగోడు రోడ్డు నుంచి చిట్యాల వయా నేరడ రోడ్డు 39 లక్షల తో ఆర్ అండ్ బి అధికారులు 8 సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.

మిర్యాలగూడ నియోజకవర్గంలోని అడవిదేవుల పల్లి క్రాస్ రోడ్డు నుంచి మొల్కల చెరువు రోడ్డు 50 లక్షలు అధికారులు మంజూరు చేశారు.టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.నకిరేకల్ వజీరాబాద్ రోడ్డు నిర్మాణ పనులకు 2020 లో 28 లక్షలు మంజూరు చేయగా టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్ ఒప్పందం చేసుకున్నాడు. కానీ ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు.అధికారులు మూడు సార్లు నోటీసులు జారీ చేసి వదిలేశారు.పెద్ద వుర మిర్యాలగూడ రోడ్డు 60 లక్షలతో నిర్మించాల్సి ఉంది.అందుకు 2020 టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది.పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో నోటీసులతో సరిపెట్టారు. డిండి దేవరకొండ రోడ్డు లో కంబాల పల్లి రోడ్డు 91 లక్షలు, అదేవిధంగా కంబాల పల్లి పొగిళ్ళ రోడ్డు నిర్మాణనికి 94 లక్షలు మంజురి కాగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.దింతో అధికారులు కాంట్రాక్టర్ల కు నోటీసులు మూడో సారి జారీ చేసి వదిలేశారు.

వర్షాలు కారణం గా దెబ్బ తిన్న రోడ్లను బాగుచేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం తో మరమ్మతులు చేయడం లేదు.నిధులు రావడం లేదని కాంట్రాక్టర్లు రోడ్ల పనులు చేయడం లేదు. రోడ్ల డ్యామేజీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.