ఈదేశంలో ప్రతి వస్తువుకి గరిష్ట చిల్లర ధర (MRP) వుంటుంది. కానీ, రైతుల పంటలకు మాత్రం ధర లభించడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కంది రైతులకు కష్టాలు తప్పడం లేదు. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా, నాణ్యత పేరుతో అధికారులు కొర్రీలు పెడుతున్నారు. తమకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో గిట్టుబాటు ధర రాక కందుల రైతులు తలలు పట్టుకుంటున్నారు. 42 వేల ఎకరాల్లో కందులు సాగు చేయగా…2 లక్షల 52 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్ పంట దిగుబడి బాగానే వచ్చింది. నల్గొండ ,కొండమల్లె పల్లి, మోత్కూరు, తిరుమలగిరి, సూర్యా పేట తోపాటు పలు చోట్ల మార్క్‌ఫెడ్ ద్వారా కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.. క్వింటాకు 6 వేల మూడు వందలు మద్దతు ధరకు కందులు కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పారు.
కానీ, నాణ్యత పేరుతో కోతలు పెడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు రోజువారీగా 500 బస్తాల కందులు వస్తున్నాయి. దీంతో మార్కెట్‌లోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు మార్క్‌ఫెడ్ అధికారులు. కంది సాగు విస్తీర్ణం ఆన్లైన్లో నమోదు చేసుకున్న రైతుల పంటను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఆన్ లైన్ లో నమోదు కాలేదని, నాణ్యత లేవనే సాకుతో మద్దతు ధర ఇవ్వడం లేదని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు.
మార్క్ ఫెడ్ ద్వారా ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంలో రైతులకు క్వింటాకు మద్దతు ధర 6 వేల 3 వందలు చెల్లిస్తామన్నారు అధికారులు.. మద్దతు ధర పొందాలంటే ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులు సూచించారు. రైతులు తమ వెంట తప్పనిసరిగా ఆధార్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, ఏదైనా బ్యాంక్ సే వింగ్ ఖాతా జిరాక్స్‌లను తీసుకురావాల్సి ఉంటుందన్నారు.
మార్క్ ఫెడ్ నిబంధనలకు అనుగుణంగానే కందులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చినా, మద్దతు ధర విషయంలో మోసపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ పొట్ట కొట్టకుండా, సానుకూల ధృక్పదంతో కొనుగోళ్లు జరపాలని కోరుతున్నారు.
