Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు

  • రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక యాగం
  • 108 మంది రుత్వికులు.. 11 హోమగుండాలతో మహా క్రతువు
  • సీఎం రేవంత్ దంపతుల ప్రత్యేక పూజలు
  • జలాశయాలు నిండాలని వరుణ దేవుడికి ప్రార్థనలు
Varuna Yagam

Varuna Yagam

Varuna Yagam : రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు నిండాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ వేదికగా ‘మహా వరుణ యాగం’ నిర్వహించింది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ విశిష్ట ఆధ్యాత్మిక క్రతువును చేపట్టారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు , వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులు 11 హోమగుండాలతో ఈ మహా యాగాన్ని శాస్త్రోక్తంగా పూజలు జరిపి పూర్తి చేశారు.

 

ఈ వరుణ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని హోమగుండంలో పూర్ణాహుతి సామాగ్రిని సమర్పించారు. కృష్ణా, గోదావరి నదులు జలకళను సంతరించుకోవాలని, రాష్ట్రంలోని చెరువులు , రిజర్వాయర్లు నిండి పంటలు సమృద్ధిగా పండాలని సీఎం దంపతులు వరుణ దేవుడిని ప్రార్థించారు. ఈ క్రతువులో పలువురు ప్రజాప్రతినిధులు , అధికారులు పాల్గొనగా, శాస్త్రోక్తంగా నిర్వహించిన మహాపూర్ణాహుతితో ఈ వరుణ యాగం ప్రశాంతంగా ముగిసింది.