317 జీవోను సవరించేదాకా ఉద్యోగ, ఉపాధ్యాయులంతా మరో మహోద్యమానికి సిద్దం కావాలని పిలుపునిస్తూ రూపొందించిన కరపత్రాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఇగ ఎట్లాంటి సమస్యలుండవ్… పిల్లలకు మంచిగ పాఠాలు చెప్పవచ్చని ఆశించి తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు నా హ్రుదయ పూర్వక నమస్సులు తెలిపారు. పరాయి పాలనలో ఏ స్థానికతకైతే భంగం వాటిల్లుతోందని పోరాడి తెలగాణ సాధించుకున్నమో అదే తెలంగాణలో మళ్లీ స్థానికత కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన చేయాల్సి రావడం బాధాకరం… దీనికంతటికీ కారణమైన 317 జీవోను సవరించాలని కోరుతూ ఆందోళనలకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయులకు, వివిధ సంఘాల నాయకులందరికీ నా నమస్కారాలు అని ఆయన అన్నారు.
మీరు చేస్తున్నది న్యాయమైన పోరాటం. మీ పోరాటానికి బీజేపీ తరపున నేను పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నాను. సకల జనుల సమ్మె వంటి చారిత్రక పోరాటంలో పాల్గొన్న నేపథ్యం మీది…. ఆనాడు పరాయి పాలనలో తెలంగాణకు జరుగుతున్న అవసరాన్ని విద్యార్థులకు, తల్లిదండ్రులకు అర్ధమయ్యేలా వివరించి పల్లె నుండి పట్నం దాకా ఉద్యమాన్ని తీసుకెళ్లడంలో ముఖ్య పాత్ర మీదే అని ఆయన అన్నారు. కానీ తెచ్చుకున్న తెలంగాణలో ఉపాధ్యాయులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. ఈ దుర్మార్గపు సీఎం తెచ్చిన అనాలోచితంగా తీసుకొచ్చిన అశాస్త్రీయమైన 317 జీవో వల్ల చివరకు మీ స్థానికతే ప్రశ్నార్థకంగా మారిపోయింది. మీ కుటుంబాలన్నీ చిన్నభిన్నమయ్యే ప్రమాదం ఏర్పడింది. మీరు పనిచేస్తున్న చోట స్థానికేతరులుగా బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
