Hospital Negligence: ములుగు జిల్లాలోని RVM ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రోగికి కనీసం స్కానింగ్ చేయకుండానే, వేరే వ్యక్తికి సంబంధించిన ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్ట్‌ను ఇచ్చి ఆస్పత్రి సిబ్బంది అడ్డంగా బుక్కైంది. వివరాల్లోకి వెళితే.. ములుగు ప్రాంతానికి చెందిన కొమ్ము కవిత అనే మహిళ శ్వాసకోశ సమస్యతో RVM ఆస్పత్రిలో చేరారు. పరీక్షించిన డాక్టర్లు ఆమెకు స్కానింగ్ చేయాలని తెలిపారు. డాక్టర్ల సూచన మేరకు కవిత కుటుంబ సభ్యులు ఆమెను స్కానింగ్ రూమ్ దగ్గరకు తీసుకెళ్లారు. అయితే, స్కానింగ్ చేయక ముందే, కొమ్ము కవిత స్కానింగ్ రిపోర్ట్ సిద్ధంగా ఉందని ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు ఇచ్చారు. స్కానింగ్ జరగక ముందే రిపోర్ట్ రావడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు దాన్ని పరిశీలించగా, అందులో అసలు విషయం బయటపడింది.
Read Also: MLA Adinarayana Reddy: వైఎస్ జగన్‌పై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీవ్ర ఆరోపణలు..!
అయితే శ్వాసకోస సమస్యతో ఆస్పత్రికి వెళ్లిన మహిళకు సంబంధించిన రిపోర్ట్ కాకుండా, ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో తమ రోగికి స్కానింగ్ చేయకుండానే, వేరే వ్యక్తి రిపోర్టును ఇచ్చారని ఆస్పత్రి సిబ్బందిని కుటుంబ సభ్యులు నిలదీయగా.. దీంతో తడబడిన ఆస్పత్రి సిబ్బంది, పొరపాటు జరిగిందని ఒప్పుకున్నారు. ఈ విషయం బయటికి చెప్పొద్దని పేషెంట్ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి.. దీనికి పరిహారంగా మళ్లీ స్కానింగ్ తీస్తామని ఉచిత సలహా ఇచ్చారు. రోగుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఆస్పత్రి సిబ్బంది నిర్వాకంపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.
